ఐటీ ఉద్యోగుల జీవితాలతో ఆటాడతారా?

Sat Aug 13 2022 21:12:35 GMT+0530 (IST)

Playing with the lives of IT employees

నటిగా నిర్మాతగా నిహారిక కొణిదెల సుపరిచితం. సాఫ్ట్ వేర్ ఉద్యోగి చైతన్యను పెళ్లాడాక నటనకు బ్రేక్ ఇచ్చారు. కానీ నిర్మాతగా తన ప్రయత్నాలను ఆపలేదు. తొలి నుంచి తనకు బాగా అలవాటు ఉన్న వెబ్ సిరీస్ మేకింగ్ వ్యాపకంతో నిహారిక ప్రస్తుతం కాలక్షేపం చేస్తున్నారు.  నిహారిక నిర్మించిన 8  ఎపిసోడ్ ల సిరీస్ `హలో వరల్డ్` స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ప్రసారానికి రెడీ అవుతోంది. ఈ సిరీస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను విశ్వక్ సేన్ -డిజె టిల్లు బ్యూటీ నేహా శెట్టి అతిథులుగా నిర్వహించారు.హైదరాబాద్ లోని ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ అయిన T-హబ్ తో జీ5  మొట్టమొదటి OTT సిరీస్ ఇది.   IT ప్రేక్షకులలో `హలో వరల్డ్`ని ప్రోత్సహించడం దీని వెనక ఉద్దేశ్యం. అలాగే ఐటీ హబ్ భవనం ముఖభాగం బ్రాండింగ్ కోసం ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ``ఐటీ ఉద్యోగుల జీవితాలకు అద్దం పట్టేలా రొమాంటిక్ డ్రామా కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది.

సిరీస్ మా బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. దర్శకుడు కఠినమైన డెడ్ లైన్ లకు కట్టుబడి తన బెస్ట్ ఇచ్చాడు. సాంకేతిక బృందం ఆర్టిస్టులు చాలా బాగా చేసారు! చిన్న పాత్రలు చేసిన తారలు కూడా  ప్రభావవంతమైన ప్రదర్శనలను అందించారు.

జీ5కి ధన్యవాదాలు`` అని అన్నారు. అతిథి విశ్వక్ సేన్ మాట్లాడుతూ తాను కూడా ఐటీ నేపథ్యం నుంచి వచ్చానని అన్నారు. యువ బృందంతో నిహారిక చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయని నేను ఆశిస్తున్నాను అన్నారు. మరో అతిథి నేహా శెట్టి మాట్లాడుతూ.. ``ఐటీ రంగంలో నాకు చాలా మంది స్నేహితులున్నారు. సదా- ఆర్యన్ రాజేష్ లకు టీమ్ లోని మిగతా వారందరికీ శుభాకాంక్షలు`` అని అన్నారు.

సదా మాట్లాడుతూ- ``నాకు మొదటి వెబ్ సిరీస్ అయినప్పటికీ సినిమా చేస్తున్నట్టుగా అనిపించింది.  నిహారిక గతంలో నిర్మాతగా విజయవంతమైన సిరీస్ లను తెరకెక్కించారు. ఆమె ప్రొడక్షన్ హౌస్ పటిష్టంగా కొనసాగుతోంది. దర్శకుడు మా నుండి బెస్ట్ ను తీసుకున్నారు. ఈ సిరీస్ ని అందరూ ఆస్వాధిస్తారని ఆశిస్తున్నాను`` అని అన్నారు.

హలో వరల్డ్ స్క్రిప్ట్ తో నిహారికను కలిసినప్పుడు తను ఒక నవలా కథ కోసం వెతుకుతున్నారని రచయిత శివ వర్ధన్ అన్నారు. నేను గతంలో చాలా సంవత్సరాల IT నేపథ్య అనుభవాన్ని పొందాను. ఈ కథను అనుభవం నుండి తీసుకున్నాను. హలో వరల్డ్  IT అలాగే సాధారణ ప్రజల జీవితాలకు సంబంధించిన కథతో తెరకెక్కింది. భావోద్వేగాలు అన్ని వర్గాలకు కనెక్టవుతాయి అని తెలిపారు.  సంగీత దర్శకుడు పి.కె.దండి మాట్లాడుతూ.. ఈ సిరీస్ లోని పాటలు రెగ్యులర్ తరహాలో ఉండవు.. అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు... అని అన్నారు.