Begin typing your search above and press return to search.

జక్కన్న సాయం లేకుండానే పాన్ ఇండియా స్టార్లుగా ఎదగాలనే ప్లాన్స్..?

By:  Tupaki Desk   |   24 Nov 2021 11:30 PM GMT
జక్కన్న సాయం లేకుండానే పాన్ ఇండియా స్టార్లుగా ఎదగాలనే ప్లాన్స్..?
X
దర్శకధీరుడు రాజమౌళి కి దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిప్పారు. ఈ క్రమంలో ఒక్క సినిమాతో ప్రభాస్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోని 'పాన్ ఇండియా స్టార్' ని చేసేశారు. ఇప్పుడు రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా నేషనల్ వైడ్ పాపులారిటీ గ్యారెంటీ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్.. ప్రమోషనల్ కంటెంట్ కు యావత్ సినీ అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఇది కచ్చితంగా జరుగుతుందనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమా చేయకుండానే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న మహేష్ బాబు.. జక్కన్నతో చేయబోయే సినిమాతో తిరుగులేని స్టార్‌ గా వెలుగొందుతారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

అయితే దర్శకధీరుడితో సినిమా చేయకుండానే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఇద్దరు టాలీవుడ్ హీరోలు గట్టిగా ప్రణాళికలు రచిస్తున్నారు. వారే అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప' అనే పాన్ ఇండియా యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' తరహాలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా 'లైగర్' అనే పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన బన్నీ కి సౌత్ లో ఎలాంటి ఇమేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. కేరళలో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందంటే.. అక్కడి సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. 'పుష్ప' సినిమాతో మాలీవుడ్ లో అతడి మార్కెట్ మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందులోనూ ఈసారి తెలుగుతో పాటుగా ఒకేసారి డైరెక్ట్ మలయాళంలో విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఈసారి ఫహాద్ ఫాజిల్ వంటి మాలీవుడ్ స్టార్ సపోర్ట్ కూడా ఉంది. అందుకే అంచనాలకు తగ్గట్లుగానే కేరళలో 'పుష్ప: ది రైజ్' ను భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

అలానే కర్ణాటకలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్.. తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్.. హిందీలో ఏఏ ఫిలిమ్స్ లాంటి పెద్ద సంస్థలు 'పుష్ప' పార్ట్-1 చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తగ్గేదే లే అంటూ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్, సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సత్తా చాటడం ఖాయమని చెప్పవచ్చు.

మరోవైపు 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. 'లైగర్' చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే వీడీ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాడనే చెప్పాలి. విజయ్ కు హిందీ ఇండస్ట్రీ నుంచి కరణ్ జోహార్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎలాగూ ఉంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచ బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ తొలిసారిగా ఇండియన్ సినిమాలో నటిస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. విజయ్ కూడా తన సినిమా రెండు వందల కోట్ల కంటే ఎక్కువ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నేషనల్ వైడ్ ఆగ్ లాగాదేన్గే అని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. వీడీ నమ్మినట్లే 'లైగర్' సక్సెస్ అయితే మాత్రం యువ హీరో మరో స్థాయికి వెళ్లాడనడంలో సందేహం లేదు.

ఇలా అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ వంటి ఇద్దరు తెలుగు హీరోలు.. రాజమౌళి అండ లేకుండానే పాన్ ఇండియా స్టార్స్ గా ఎదగాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.