Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: వేలాడుతూ ఆరోగ్య సందేశం

By:  Tupaki Desk   |   9 April 2020 3:45 AM GMT
ఫోటో స్టోరీ: వేలాడుతూ ఆరోగ్య సందేశం
X
టాలీవుడ్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ అంటే తన చెవులే కాకుండా ఫాలోయర్ల చెవులు కూడా కోసేస్తుందన్న విషయం అందరికీ ఎప్పుడో అర్థం అయింది. చాలామంది ఫిమేల్ సెలబ్రిటీలు బిజినెస్ అంటే.. ఏ మూతి రంగులో లేదా అత్తరు సెంట్ల వెనకో పడతారు కానీ రకుల్ మాత్రం F45 జిమ్ ఫ్రాంచైజీలు తీసుకుని తన ప్రాధాన్యత ఏంటో చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం భారతీయులందరినీ బడా రాజకీయనాయకులను అరెస్ట్ చేసినట్టుగా హౌస్ అరెస్ట్ చేశారు. కాకపోతే దానికి స్టైలుగా లాక్ డౌన్ అంటూ ఓ ముద్దు పేరు పెట్టారు. ప్రస్తుతం రకుల్ కూడా ఈ హౌస్ అరెస్ట్ లోనే ఉంది.

అయితే ఈ భామ ఈ ఖాళీ సమయాన్ని చిత్రవిచిత్రమైన యోగాసనాలు వేసేందుకు వినియోగిస్తూ ఫుల్లుగా టైమ్ పాస్ చేస్తోంది. సోషల్ మీడియాలో రకుల్ సూపర్ యాక్టివ్ కాబట్టి ఆఫోటోలను షేర్ చేస్తూ అందరికీ యోగా సందేశం ఇస్తోంది. ఈరోజు అలానే ఓ తలక్రిందులుగా ఓ వస్త్రానికి వేలాడుతూ ఉండే ఓ ఫోటోను పోస్ట్ చేసి పెద్ద మెసేజ్ పెట్టింది. "ఇలాంటి సమయంలోనే మనం ఆరోగ్యం విలువ తెలుసుకుంటాం. నా వరకూ నాకు ఆరోగ్యం అంటే శారీరకమైన ఆరోగ్యం మాత్రమే కాదు..మానసికమైన ఆరోగ్యం కూడా అందులో ఉంటుంది. ఎమోషనల్ గా కూడా స్థిరంగా ఉండాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నువ్వెంత సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నావనేదే నీ ఆరోగ్యం. మనం ఇప్పుడు మునుపటికంటే ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా ఆరోగ్యంగా ఉండేందుకు మీ వంతుగా ప్రయత్నం ప్రారంభించండి. సరైన ఆహారం తినండి.. ఆశావహ దృక్పథాన్ని అలవరుచుకోండి. సంతోషంగా ఉండండి.. జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి."

రకుల్ అంటే ఫ్యాషన్ మాత్రమే అనుకుంటారు కానీ ఈ స్థాయిలో ఆరోగ్యం ఫిలాసఫీ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ కరోనా సమయంలో అందాల విందులు చేసే కంటే ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగించే ఇలాంటి మెసేజులు మంచిదే. ఎవరో ఒకరు ప్రేరణ పొందుతారు కదా. అలా ప్రేరణ పొంది చిన్నప్పుడు పీఈటీ టీచర్ చెప్పిన 'స్టాంటీజ్ - అటెన్షన్' (స్టాండ్ ఎట్ ఈజ్- అటెన్షన్) లతో మొదలు పెట్టండి. అక్షరాభ్యాసం నాడే ఆల్జీబ్రా ఈక్వేషన్స్ సాల్వ్ చేసే కరోడాల తరహాలో అలవాటు లేకుండా.. యోగా గారితో పరిచయం లేకుండా అలా బేతాళుడి టైపులో వేలాడే కసరత్తులు చేయకండి. తర్వాత జరిగే విపరీత పరిణామాలకు రకుల్ బాధ్యత వహిస్తుంది అనుకోవడం ఉత్త భ్రమ!