సందడి సందడిగా 'పెళ్లి సందD' టీజర్..!

Tue Sep 14 2021 17:07:59 GMT+0530 (IST)

Pelli SandaD Teaser Talk

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''పెళ్లి సందD''. పాతికేళ్ల క్రితం వచ్చిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 'పెళ్లిసందడి' థీమ్ తో ఈ సినిమా రూపొందుతోంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'పెళ్లి సందD' టీజర్ ను కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.'పెళ్లి సందD' టీజర్ లో హీరో రోషన్ ను ఒక వాలీబాల్ క్రీడాకారుడిగా.. హీరోయిన్ ను సహస్ర అనే అందమైన అమ్మాయిగా చూపించారు. ఈ క్రమంలో సహస్ర ప్రేమలో పడిన రోషన్.. తననే పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ తో ఛాలెంజ్ చేస్తున్నాడు. పెళ్లి నేపథ్యంలోని ఈ సినిమా సాగుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.  దర్శకేంద్రుడు గత చిత్రాల తరహాలోనే భారీ తారాగణంతో బ్యూటిఫుల్ విజువల్స్ తో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. సంగీత దర్శకుడు కీరవాణి 'పెళ్లిసందడి' పాటను ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ గా ఉపయోగించడం గమనార్హం.

'పెళ్లి సందD' చిత్రంలో ప్రకాశ్ రాజ్ - రాజేంద్రప్రసాద్ - రావు రమేష్ - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణ మురళి - హేమ - ప్రగతి - ఝాన్సీ - శ్రీనివాస్ రెడ్డి - షకలక శంకర్ - ఫిష్ వెంకట్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ - ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.