Begin typing your search above and press return to search.

పాయ‌ల్ కూడా స్టార్ కిడ్స్ కి పంచ్ వేసింది!

By:  Tupaki Desk   |   18 Aug 2022 6:30 AM GMT
పాయ‌ల్ కూడా స్టార్ కిడ్స్ కి పంచ్ వేసింది!
X
'Rx 100' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌ పుత్ య‌ధార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన తొలి మూవీతో సెన్సేష‌న‌ల్ హిట్ ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో అందాల ఆర‌బోత విష‌యంలో కానీ లిప్ లాక్ స‌న్నివేశాల్లో కానీ ఎలాంటి బెరుకు లేకుండా న‌టించడంతో పాయ‌ల్ నాజ్ పుత్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో, ప్రేక్ష‌కుల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ త‌రువాత మాత్రం ఆ స్థాయి స‌క్సెస్ ని ఏమాత్రం ద‌క్కించుకోలేక‌పోతోంది.

దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత పాయ‌ల్ రాజ్ పుత్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'తీస్ మార్ ఖాన్‌'. ఆది సాయి కుమార్ హీరోగా న‌టించిన ఈ మూవీని 'నాట‌కం' ఫేమ్‌ క‌ల్యాణ్ జీ గోగ‌ణ తెర‌కెక్కించారు.ఆది సాయికుమార్ తో పాటు పాయ‌ల్ రాజ్ పుత్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ ఆగ‌స్టు 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర బృందం నిర్వ‌హించింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పాయ‌ల్ రాజ్ పుత్ నెపోటిజ‌మ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. గ‌తంలో ఇండ‌స్ట్రీలో బంధు ప్రీతి, వార‌స‌త్వం గురించి హీరోలు మాత్ర‌మే మాట్లాడే వారు కానీ ఇప్ప‌డు తొలి సారి ఇండ‌స్ట్రీలో వున్న నెపోటిజ‌మ్ గురించి ఒక హీరోయిన్ ఇండైరెక్ట్ గా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

పాయ‌ల్ రాజ్ పుత్ మాట్లాడుతూ తాజాగా స్టార్ కిడ్స్ కి పంచ్ వేసింది. త‌ను స్టార్ కిడ్ ని కాద‌ని, స్వ‌త‌హాగానే నేమ్‌ని, ఫేమ్ ని సొంతం చేసుకున్నాన‌ని స్టార్ కిడ్స్ పై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసింది.

పాయ‌ల్ రాజ్ పుత్ మాట్లాడుతూ నేను ఈ రోజు చాలా సంతోషంగా వున్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైమ్ లో కాస్త నెర్వ‌స్ గా వుంటాను. అది అంద‌రికి స‌హ‌జంగానే వుంటుంది. మా సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు అన్నింటికీ విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. మా సినిమాకు మీ ప్రేమ ద‌క్కినందుకు మాకు సంతోషంగా వుంది. నేనేం స్టార్ కిడ్ ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ‌, అభిమానం వ‌ల్లే చేయ‌గ‌లిగాను.

ఈ సినిమా నాకెంతో స్పెష‌ల్‌. మూడేళ్ల త‌రువాత నా సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్ లు అద్భుతంగా ఉంటాయి అని తెలిపింది. ఉన్న‌ట్టుండి పాయ‌ల్ నెపోటిజ‌మ్‌.. స్టార్ కిడ్స్ గురించి ఎందుకు సెల‌విచ్చిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అలా అయినా వార్త‌ల్లో నిలిచి మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌నా? .. లేక కావాల‌నే స్టార్ కిడ్స్ పై సెటైర్లు వేస్తోందా? అని అంతా గుస‌గుస‌లాడుతున్నారు.