సినిమాల మాటేంటని పవన్ ను అడిగితే..

Sun Dec 15 2019 13:09:07 GMT+0530 (IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి పునరాగమనం చేయడం ఖాయమైంది. ఆయన రీఎంట్రీ మూవీ ‘పింక్’ ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కానీ తన రీఎంట్రీ గురించి పవన్ ఒక మాట చెబితే బాగుండని చూస్తున్నారు అభిమానులు. కానీ పవన్ స్పష్టంగా ఈ విషయం చెప్పట్లేదు. సినిమాల్లోకి వస్తే తప్పేంటి.. డబ్బులు కావాలంటే సినిమాలు చేయాల్సిందే కదా.. వేరే రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయట్లేదా.. అంటూ నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు తప్ప.. అవును - మళ్లీ సినిమాలు చేయబోతున్నా అని మాత్రం స్పష్టంగా చెప్పట్లేదు. తాజాగా ఓ ప్రధాన పత్రికతో ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల్లోకి పునరాగమనం చేయడం గురించి సూటిగా ప్రశ్నించినా కూడా పవన్ స్పష్టంగా సమాధానం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. సినిమాల గురించి మాట్లాడ్డమే ఇష్టం లేదన్నట్లుగా పవన్ వ్యవహరించాడు.‘‘సినిమా ప్రతిపాదనలు కొన్ని చర్చల దశలో ఉన్నాయి. అయినా ఒక్కోసారి నటుడి తాలూకు మానసిక స్థితిని దాటేశానేమో అనిపిస్తుంది. అయినా నా సినిమాల గురించి ఎందుకు.. రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. నా ఆలోచన సామాన్య ప్రజల కోసం ఏమైనా చేయాలనే దాని మీదే తిరుగుతుంది’’.. ఇదీ సినిమాల గురించి అడిగితే పవన్ చెప్పిన సమాధానం. మొత్తానికి మళ్లీ సినిమాలు చేయడం కోసం చర్చలు జరుగుతున్న మాట మాత్రం వాస్తవమే అని పవన్ ఒప్పుకున్నట్లే ఉంది. కానీ ఫలానా సినిమా చేస్తా.. ఎప్పట్నుంచి పని మొదలుపెడతా అని మాత్రం పవన్ మాట్లాడలేదు. ఐతే మరో ప్రశ్నకు సమాధానంగా తన బేనర్లో సినిమాల నిర్మాణం మాత్రం ఉంటుందని పవన్ స్పష్టం చేశాడు. మరి రామ్ చరణ్ తో సినిమా ప్రొడ్యూస్ చేయడం సంగతేంటి అని అడిగితే.. తప్పకుండా చేస్తానని.. కానీ ఆ సినిమాకు దర్శకుడెవరు.. కథేంటి అనే విషయాలు ఖరారవ్వలేదని పవన్ చెప్పాడు.