Begin typing your search above and press return to search.

ప‌వ‌న్-బీజేపీ.. భారీ క‌వాతు

By:  Tupaki Desk   |   23 Jan 2020 4:25 AM GMT
ప‌వ‌న్-బీజేపీ.. భారీ క‌వాతు
X
అంద‌రూ అనుకున్న‌ట్లే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జ‌న‌తా పార్టీతో చేతులు క‌లిపాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆర్థిక వ‌న‌రులు - క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ - అధికారం.. ఇవేమీ లేని త‌న పార్టీకి భాజ‌పా అండ చాలా అవ‌స‌ర‌మ‌ని భావించి ప‌ర‌స్ప‌ర లాభం చేకూరేలా ఆ పార్టీతో క‌లిసి సాగేందుకు నిర్ణ‌యించుకున్నాడు ప‌వ‌న్. పొత్తు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా ఒక ప్రెస్ మీట్‌ లో భాజ‌పా నేత‌ల‌తో క‌లిసి క‌నిపించాడు ప‌వ‌న్. త్వ‌ర‌లోనే ఆ పార్టీతో క‌లిసి ఓ పెద్ద కార్య‌క్ర‌మం చేప‌ట్టేందుకు ప‌వ‌న్ రంగం సిద్ధం చేసుకున్నాడు. జ‌గ‌న్ స‌ర్కారు మూడు రాజ‌ధానుల తీర్మానంపై భాజ‌పా పెద్ద‌ల‌తో క‌లిసి చ‌ర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ప‌వ‌న్.. అక్క‌డి నుంచే భాజ‌పాతో క‌లిసి చేయ‌బోయే తొలి కార్య‌క్ర‌మం గురించి వెల్ల‌డించాడు.

మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తూ అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావంగా ఫిబ్ర‌వ‌రి 2న భాజ‌పాతో క‌లిసి జ‌న‌సేన భారీ క‌వాతు నిర్వ‌హించ‌బోతోంది. ఇంత‌కుముందు ఏపీలో ఇసుక సంక్షోభంపై ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నంలో క‌వాతు నిర్వ‌హించాడు. దానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఆ క‌వాతులో జ‌న‌సేన బ‌లం క‌నిపించింది. ఇప్పుడు భాజ‌పా బ‌లం కూడా తోడ‌వుతుండ‌టంతో ఈ క‌వాతు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఫిబ్ర‌వ‌రి 2న మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజీ నుంచి బంద‌రు రోడ్డులోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్ వ‌ర‌కు ఈ క‌వాతు చేయ‌బోతున్నారు. అమ‌రావ‌తి రైతుల‌కు భ‌రోసానిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం ఈ క‌వాతు నిర్వ‌హిస్తున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించింది.