జానీ పారితోషికం మాదాపూర్ భూములపై పెట్టాల్సింది!

Fri Dec 06 2019 10:28:35 GMT+0530 (IST)

సముద్రాలు మూడొంతులు ఉంటే భూమి ఉన్నది ఒక వంతు మాత్రమే. అందుకని భూమి కొనుక్కోండి.. ధరలు చుక్కల్ని అంటుతాయి!! అంటూ ఎంతో ముందు చూపుతో చెప్పారు శోభన్ బాబు. ఆయన మాట విన్నవాళ్లంతా బాగు పడ్డారు. సినీఇండస్ట్రీలో జ్ఞానం ఉన్న ఎందరో శోభన్ బాబునే ఫాలో అవుతారు. శోభన్ బాబు మాట విని ఓ సినీపెద్దాయన వేల కోట్ల సామ్రాజ్యాన్నే విస్తరించారు. విలువైన మాధాపూర్ భూములన్నీ కొనేశారు. ఇక అందగాడి మాటల్ని గుర్తు చేసుకుని 100 గజాలు కొనుక్కునేవాళ్లు ఎందరో. అయితే స్టార్ హీరో పవన్ కల్యాణ్ మాత్రం తనకు 2కోట్ల పారితోషికం వచ్చినా .. మాదాపూర్ లో 30ఎకరాలు కొనుక్కునే అవకాశం ఉండీ కొనుక్కోలేదని అపరిపక్వతను అంగీకరించడం పరిశ్రమలో చర్చకు వచ్చింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించి దర్శకత్వం వహించిన `జానీ` భారీ అంచనాల నడుమ రిలీజై  బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ సినిమా సమయానికే పవన్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. అయితే ఊహించినది ఒకటి అయినది ఇంకోటి. ఎంతో ఆశిస్తే బయ్యర్లు పంపిణీదారులు దివాళా తీశారు. అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వైఫల్యం ఎదురైంది.  

అయితే అంత జరిగినా ఆ చిత్రానికి పవన్ స్టార్ డమ్ దృష్ట్యా రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నారట. ఆ డబ్బుతో దూరపు చూపు చూసి మాదాపూర్ లో 30 ఎకరాలు కొని వుంటే నేడు వేల కోట్ల అధిపతిని అయ్యి ఉండేవాడినని జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం సంచలన ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క అభ్యర్ధిని తప్ప తనతో పాటు ఎవరినీ గెలిపించుకోలేకపోయిన పవన్ ప్రస్తుతం జనసేనను బలోపేతం చేసే పనిలో భాగంగా రాజయలసీమ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. డబ్బు కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తనకు లేదని.. అలా అయితే సినిమాల్లోనే వేల కోట్లు సంపాదించేవాడినని చెప్పడం ఆసక్తికరంగా మారింది.