Begin typing your search above and press return to search.

మోహన్ బాబును సీన్లోకి లాగిన పవన్.. విద్యా సంస్థను టచ్ చేశారుగా

By:  Tupaki Desk   |   26 Sep 2021 5:30 AM GMT
మోహన్ బాబును సీన్లోకి లాగిన పవన్.. విద్యా సంస్థను టచ్ చేశారుగా
X
ఎవరేం చెప్పినా కొన్ని విషయాలు మీడియాలో వచ్చే దానికి.. విడిగా ఉండే దానికి మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సరే సూటిగా మాట్లాడతారంటూ కొంతమందికి భారీ ట్యాగులు ఇస్తుంటుంది మీడియా.మరి.. అలాంటి ట్యాగులు ఉన్న వారు.. కీలక అంశం మీద ఎందుకు మాట్లాడరు? మౌనంగా ఎందుకు ఉంటారు? లాంటి ప్రశ్నల్ని సంధించేందుకు మీడియా ఇష్టపడదు. ఆ మాటకు వస్తే.. కొంతమంది ప్రముఖుల మీద ఇష్టం వచ్చినట్లుగా రాసేసే మీడియా.. మరికొందరి విషయంలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది.

ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మోహన్ బాబు విషయంలో విమర్శలను.. ఆయనపై ప్రతికూల వార్తల్ని అచ్చేయటానికి ఆసక్తిని చూపరు. అంతేనా.. ప్రముఖ మీడియా సంస్థల్లో మోహన్ బాబు..ఆయన కుటుంబీకులు నటించే సినిమాలకు సంబంధించిన నెగిటివ్ రాస్తే..ఒప్పుకోరన్న మాట వినిపిస్తూ ఉంటుంది.దీనికి తగ్గట్లే.. వారి సినిమా రివ్యూలు కూడా జాగ్రత్తగా రాస్తారంటారు.

అలాంటి మోహన్ బాబు విషయాన్ని సూటిగా తెర మీదకు తీసుకొచ్చేశారు పవన్ కల్యాణ్. రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ వేళ.. ఏపీ ప్రభుత్వం మీదా.. వైసీపీ నేతల మీదా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ కల్యాన్.. జనసేన అధినేత హోదా కంటే కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు.. మోహన్ బాబు ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కల్యాణ్.. 'మీరు బంధువులు కదా. చిత్రపరిశ్రమను హింసించొద్దని చెప్పండి. ఇప్పుడు సినిమాలపై పెట్టిన నిబంధన రేపు మీ విద్యా నికేతన్ సంస్థలకూ వర్తింపచేయొచ్చు. మీ విద్యా సంస్థలో ఉన్న 5500 మంది విద్యార్థుల ఫీజులు ఆన్ లైన్ లో కట్టాలని ప్రభుత్వమే తీసుకుంటే ఏమవుతుంది? మీరు మాట్లాడాలి. దీని గురించి స్పందించాలి' అంటూ సూటిగా మాట్లాడేశారు. మరి.. పవన్ మాటలకు మోహన్ బాబు స్పందన ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.