ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు బాధించాయి!- పవన్

Wed Aug 21 2019 23:21:37 GMT+0530 (IST)

Pawan Kalyan about Inter Students Suicides at Chiru Birthday Event

నేటి సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ముఖ్య అతిధి జనసేనాని పవన్ కల్యాణ్  ఎమోషనల్ స్పీచ్ ఆద్యంతం మెగాభిమానుల్ని ఆకట్టుకుంది. అన్నయ్య గురించి మాట్లాడుతూనే ఆయన ప్రత్యేకించి తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపైనా ఆవేదన వ్యక్తం చేశారు.అప్పట్లో తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగిందని పవర్ స్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కూడా ఇంటర్ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సిన సన్నివేశం ఎదురైందని అయితే అన్నయ్య ఆపడం వల్లనే ఆ ప్రయత్నం విరమించుకున్నానని స్ఫూర్తివంతమైన మాటలతో ఆకట్టుకున్నారు.

చిరు బర్త్ డే వేడుకల్లో పవన్ మాట్లాడుతూ -``జీవితంలో నన్ను అన్నయ్య మూడు సార్లు దారి తప్పకుండా కాపాడారు. అందుకే ఆయన్ని స్ఫూర్తి ప్రదాత అంటాను. నేను ఇంటర్ ఫెయిలైనప్పుడు నాకు అలాంటి నిరాశ నిస్పృహ కలిగింది. అన్నయ్య దగ్గర ఉన్న లైసెన్డ్ పిస్టోల్ తో కాల్చుకుందామనుకున్నాను. నా డిప్రెషన్ చూసి ఇంట్లోవాళ్లు అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. నువ్వు ముందు బతకాలిరా బాబూ.. ఇంటర్ పెద్ద విషయం కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు! అనడం స్ఫూర్తి నింపింది ఆరోజు. అందుకే ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల్ని .. ఆ బిడ్డల్ని చూసి బాధ కలిగింది. రాజకీయ నాయకుల్ని తప్పు పట్టొచ్చు. కానీ.. ఇంట్లో పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లు ఉండి ఉంటే బావుండేది అనిపించింది`` అని పవన్ ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాడిని. దేశం సమాజం అంటే నాకు గొప్ప ప్రేమ. అయితే నా కోపాన్ని తగ్గించింది అన్నయ్యనే. కులం మతం ను మించి మానవత్వం అనేది ఒకటి ఉంటుందని నన్ను ఎక్స్ ట్రీమిటీకి వెళ్లకుండా ఆపేశారు అన్నయ్య. 22 వయసులో తిరుపతికి వెళ్లిపోయాను. నిర్మాత తిరుపతి ప్రసాద్ గారిని కలిసి 5-6 నెలలు యోగాశ్రమంలో ఉండిపోయాను. నేను ఆ దారిలోనే ఉండాలనుకున్నా. కానీ భగవంతుడు అయ్యి వెళ్లిపోతే నువ్వు స్వర్థ పరుడివి. ఇంట్లో బాధ్యతలు ఉంటే నువ్విలా చేయవు!! అని అన్నయ్య అన్నారు. తను కష్టపడి నన్ను నిలబెట్టాడు అన్నయ్య. అందుకే ఆయన స్ఫూర్తి ప్రధాత. ఈ మూడు సంఘటనల్లో దెబ్బలు తిన్నా నన్ను నిలబెట్టారు... అని తెలిపారు.