ఇది పవన్ విజృంభణమే

Tue Feb 23 2021 08:37:37 GMT+0530 (IST)

Pawan Kalyan Upcoming Movie Updates

పవన్ కల్యాణ్ ఒక పేరు కాదు .. అది కుర్రాళ్లు జపించే ఒక శక్తి మాత్రం. పవన్ పేరు వింటేచాలు కుర్రాళ్లకు పూనకాలు వచ్చేస్తాయి. ఆయన ప్రతి కదలిక ప్రత్యేకమైనదిగా వాళ్లు భావిస్తుంటారు. జయాపజయాలతో పని లేకుండా ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు .. ఇక సినిమాలు చేయనన్నప్పుడు వాళ్లంతా చాలా బాధపడ్డారు. ఆ తరువాత ఆయన మనసు మార్చుకుంటే ఎంతో ఆనందపడ్డారు. రీ ఎంట్రీలో పవన్ ఒకటి రెండు సినిమాలు చేయవచ్చునేమోనని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఓ అరడజను సినిమాలు లైన్లో పెట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు.రీ ఎంట్రీలో భాగంగా పవన్ ముందుగా 'వకీల్ సాబ్' సినిమాను చేశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కథే హీరో .. ఆ కథను నడిపిస్తున్న ప్రధాన పాత్రధారిగా పవన్ ఇందులో కనిపిస్తాడు. తనకి గల క్రేజ్ కి పవన్ ఈ సినిమాను ఒప్పుకోవడమే పెద్ద విశేషం. కొత్తదనం వైపు పవన్ అడుగులు వేస్తున్నాడనడానికి ఇదొక నిదర్శనం. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను పవన్ .. సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్.

ఈ రీమేక్ లో పవన్ .. రానాతో కలిసి నటిస్తుండటం విశేషం. ఈ ఏడాదిలో ఆయన చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇదే. అంతేకాదు స్టార్ డైరెక్టర్లు కాకపోయినప్పటికీ వేణు శ్రీరామ్ .. సాగర్ చంద్ర వంటి దర్శకులకు పవన్ ఛాన్స్ ఇవ్వడం పెద్ద విషయంగానే .. విశేషంగానే చెప్పుకోవాలి. పవన్ ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పుగా ఒప్పుకోవాలి. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక భారీ చారిత్రక చిత్రాన్ని చేస్తున్నాడు. పవన్ చేస్తున్న తొలి చారిత్రక చిత్రం ఇది .. ఆయన కెరియర్లోనే తొలి భారీబడ్జెట్ చిత్రం ఇది. ఆయన పోషిస్తున్న 'వీరమల్లు' పాత్ర కూడా ఇంతవరకూ చేయనిదే.

పవన్ఈ చేస్తున్న మూడు సినిమాలు వేటికవే విభిన్నమైనవి .. అందులోని పాత్రలు విలక్షణమైనవి. ఒకదానితో ఒకటి సంబంధం లేని జోనర్లు. ఒక సినిమా పూర్తయితేనే తప్ప మరో సినిమా చేయని పవన్ ఒకేసారి మూడు సినిమాలు చేస్తుండటం ఆయన అభిమానులకు మరింత ఉత్సాహాన్ని పెంచుతున్న విషయం. వైవిధ్యభరితమైన ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలో విడుదలయ్యేవే .. పవన్ జోరుకు పగ్గాలు లేవని నిరూపించేవే. చూస్తుంటే ఈ ఏడాది ఆయన విజృంభణం ఒక రేంజులో సాగనుందనే విషయం అర్థమవుతోంది కదూ.