'పవర్ స్టార్' స్టిల్స్ చూశాక పవన్ రియాక్షన్ ఇదీ

Fri Jul 10 2020 09:30:28 GMT+0530 (IST)

 Pawan Kalyan Reaction On RGV Power Star

సంఘంలో జీవించి ఉన్న ఎవరైనా ఓ ప్రముఖుని జీవిత కథను కానీ.. లేదా అతడి జీవితంలో కొంత భాగాన్ని కానీ తెరపై ఆవిష్కరించాలనుకున్నప్పుడు అందుకు కొన్ని ఛాలెంజ్ ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అచ్చంగా అలాగే ఉన్న ఒక హీరోని వెతకాలి. అతడి ఆహార్యాన్ని సెట్ చేసేందుకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి తోడు జీవించి ఉన్న ఆ ప్రముఖుడి వైపు నుంచి.. అతడి ఫ్యాన్స్ నుంచి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎటాక్ చేస్తే దానిని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఇలాంటి గట్స్ టాలీవుడ్ లో ఎందరికి ఉన్నాయి? అంటే అది ఒకే ఒక్క ఆర్జీవీకి మాత్రమే సాధ్యం.ఇటీవలి కాలంలో వరుస బయోపిక్ లతో వేడెక్కించేస్తున్న ఆర్జీవీ `పవర్ స్టార్` అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని తెరపైకి తేవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల అచ్చం పవన్ లానే ఉన్న ఒక టిక్ టాక్ స్టార్ ని సెలెక్ట్ చేసుకున్న ఆర్జీవీకి వెంటనే దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఎదుర్కోక తప్పలేదు. సదరు టిక్ టాక్ స్టార్ ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. అంటే ఆర్జీవీ ఇప్పుడు మరో పవర్ స్టార్ ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అదంతా సరే కానీ .. ఆర్జీవీ పవర్ స్టార్ టైటిల్ ని ప్రకటించి.. హీరో స్టిల్స్ ని రిలీజ్ చేసినప్పుడు అవన్నీ నెటిజనుల్లో వైరల్ అయ్యాయి. వీటికి ఒరిజినల్ పవర్ స్టార్ రియాక్షన్ ఏమిటి? అన్నది ఎవరికీ ఇన్నాళ్లు తెలియలేదు.

తాజా సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ స్టిల్స్ చూడగానే పవన్ కల్యాణ్ ఫక్కున నవ్వారట. ఆర్జీవీ కొంటె వేషాలు అతడికి నిజంగానే నవ్వు తెప్పించాయిట. ఒక స్టిల్ లో అన్నయ్య చిరంజీవి పక్కనే కూచుని తల పట్టుకుని ఎంతో అసహనంగా కనిపిస్తున్నాడు పవన్. చిరు తనని ఏదో సముదాయిస్తున్నట్టుగా ఉందా స్టిల్. వేరొక స్టిల్ లో త్రివిక్రమ్ తనపాటికి తాను స్క్రిప్టును వివరిస్తూ పోతుంటే.. అదేమీ పట్టనట్టు ఎటో తిరిగి పవన్ వింటున్నట్టే లేదు. ఇలాంటి సెటైరికల్ రియాలిటీని ఆవిష్కరించడం అంటే అది వర్మకు మాత్రమే ఉన్న గ్రేట్ కామెడీ టైమింగ్.. గ్రేట్ సెన్స్ అనే చెప్పాలి. అవన్నీ ఒరిజినల్ గా జరిగిన ఘటనలే. వాటిని ఊహించి ఇలా స్టిల్స్ రూపంలో రిలీజ్ చేయడం గొప్ప విషయం. అందుకే పవన్ ఆ స్టిల్స్ చూసిన వెంటనే నవ్వేశారట. అంతేకాదు అసలు ఈ సినిమా తీస్తున్నందుకు ఆర్జీవీపై పవన్ ఎంతమాత్రం సీరియస్ గా లేరు సరికదా ఆయన పనిలో ఆయన పడిపోయారట. ఎంతసేపూ సోషల్ మీడియాలో ఆర్జీవీని టార్గెట్ చేసేది కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమేనని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

`పవర్ స్టార్` టైటిల్ కాగా  `ఎన్నికల ఫలితాలా తార్వతా కథ` అనేది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ కథను రివీల్ చేస్తోంది. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని.. ఆర్జీవీ దాని చుట్టూ ఒక కథను వండి వార్చేందుకు సిద్ధంగా ఉన్నాడని ఈ ఉపశీర్షికను బట్టి అర్థం చేసుకోవచ్చు.