Begin typing your search above and press return to search.

పర్వీన్​ జీవితం.. విషాదాంతం

By:  Tupaki Desk   |   18 Oct 2020 10:30 AM GMT
పర్వీన్​ జీవితం..  విషాదాంతం
X
పర్వీన్​ బాబీ బాలీవుడ్​లో ఒకప్పటి స్టార్​ హీరోయిన్​.. కల్లోలం, గందరగోళం, విషాదం, మానసిక రుగ్మతలు ఆమె జీవితమంతా కన్నీళ్లే. ఆమె జీవితంలోకి అనుకోకుండా వచ్చినవాళ్లు కొందరైతే.. కావాలని చొరబడ్డ వాళ్లు మరికొందరు. ఇలా ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేశారు. కెరీర్​ మొదట్లో కబీర్​ బేడీతో అనుబంధాన్ని పెంచుకున్న పర్వీన్​ వివిధ కారణాలతో అతడిని వదిలేసింది. నిజానికి ఆమె వదిలించుకున్నది. ఆ గ్యాప్​లో కాస్త డిప్రెషన్​లో ఉన్న పర్వీన్​కు డానీ స్నేహం కాస్త ఊరటనిచ్చింది. అప్పుడే ఆమెకు మహేశ్‌ భట్‌ తారసపడ్డాడు. మహేశ్​ భట్​తో సహజీవనం చేసేనాటికి పర్వీన్​ బాబీ బాలీవుడ్​లో దూసుకుపోతున్నది. అప్పటికింకా మహేశ్​ డైరెక్టర్​గా నిలదొక్కుకోలేదు. కేవలం ఓ యంగ్​ డైరెక్టర్​గా మాత్రం గుర్తింపు తెత్చుకున్నాడు. అతడు పర్వీన్‌ బాబీకి పిచ్చి అభిమాని. అయితే తొలి పరిచయంలోనే పర్వీన్​ను ఆకట్టుకున్నాడు. ఇద్దరికీ సాంగత్యం పెరిగింది. అప్పటికే మహేశ్‌ భట్‌కు లారెన్‌ బ్రైట్‌తో పెళ్లయి కూతురు కూడా (పూజా భట్‌) ఉన్నారు. పర్వీన్‌ కోసం వాళ్లను వదిలేశాడు. పర్వీన్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత స్నేహితురాలి మొహంలో నవ్వు చూసి సంతోషపడ్డాడు డానీ. పర్వీన్, మహేశ్‌ భట్‌ మూడేళ్లు కలిసున్నారు. కానీ అప్పటికే పర్వీన్​ జీవితంపై బాలీవుడ్​లో పుకార్లు పుట్టాయి.

కొందరు పెద్దల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. మహేశ్‌ భట్‌ షూటింగ్‌ ముగించుకొని ఇంటికొచ్చేటప్పటికి పర్వీన్‌ భయం, భయంగా కనిపించింది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. ఆ రోజు నుంచి పర్వీన్‌ మానసికంగా కుంగిపోయింది. మహేశ్‌కు కంటిమీద కునుకు కరువైంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే పారనాయిడ్‌ స్కిజోఫ్రీనియా అని తేలింది. కొంతకాలం పాటు సినిమా వాతావరణానికి దూరంగా బెంగళూరులో ఉన్నారు. మందులు వాడినా ఆమె మానసిక స్థితి మెరుగుపడలేదు. అమితాబ్​ తనను బెదరించాడని.. తనను చంపడానికి మనుషులను పెట్టాడని నిత్యం పర్వీన్​ బాధపడుతూ ఉండేదట. అయితే చివరకు ఆమెను మహేశ్‌ కూడా వదిలేశాడు. తన భార్య లారెన్‌కు దగ్గరయ్యాడు మళ్లీ ఒంటరిగానే మిగిలిపోయింది పర్వీన్‌.

పారనాయిడ్‌ స్కిజోఫ్రీనియా, మధుమేహం ఇతర ఆరోగ్య సమస్యలతో 2005లో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఆమె చనిపోయిన రెండు రోజులకుగాని ఆ విషయం ఆమె ఇరుగుపొరుగుకు తెలియలేదు. పర్వీన్‌ మరణవార్త విన్నవెంటనే పరిగెత్తుకొచ్చాడు మహేశ్‌. డానీ, కబీర్‌బేడీ చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలను మహేశ్‌ భట్‌ జరిపించాడు. తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమంగా రాసిచ్చింది పర్వీన్‌ బాబీ.