Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డేర్ చేయలేకపోతున్నారా...?

By:  Tupaki Desk   |   13 July 2020 3:30 AM GMT
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డేర్ చేయలేకపోతున్నారా...?
X
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వక వంద రోజులు దాటిపోయింది. కొత్త సినిమాలతో థియేటర్స్ లో సందడిగా ఉండే సమ్మర్ సీజన్ మొత్తం సినిమా లేకుండానే గడిచిపోయింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు ప్రొడ్యూసర్స్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు చూస్తున్నారు. సినిమా కోసం తెచ్చిన డబ్బుల పై వడ్డీలు పెరుగుతుండటం.. రోజులు గడిచే కొద్దీ ఆ కంటెంట్‌ ఓల్డ్ అయిపోతుందేమో అనే ఆలోచనతో ఓటీటీలలో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీ విడుదలకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం క్రేజీ మూవీస్ ఏవీ ఓటీటీలలో రిలీజ్ అవలేదు.

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ లాంటి హీరోలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేస్తే 200 కోట్లకు పైగానే వసూలు చేస్తాయి. వారి గత చిత్రాలు చూసుకుంటే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అలాంటి హీరోల సినిమాలు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ బాంబ్' సినిమా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక అజయ్‌ దేవగణ్‌ - సంజయ్ దత్ నటించిన 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' సినిమా కూడా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో రిలీజ్ కానుంది. వీటితో పాటు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ చివరి చిత్రం 'దిల్‌ బెచారా' జులై 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆలియా భట్‌ 'సడక్‌ 2'.. అభిషేక్‌ బచ్చన్‌ 'ది బిగ్‌ బుల్‌'.. విద్యుత్‌ జమాల్ 'ఖుదాఫీజ్‌‌'.. కునాల్‌ ఖేమూ 'లూట్‌ కేస్‌'.. విద్యాబాలన్ 'శకుంతలాదేవి' చిత్రాలు కూడా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్ కి వెనకాడుతున్నాయి.

ఇప్పటి వరకు తెలుగులో ఓటీటీ రిలీజులు అన్నీ చిన్న సినిమాలే. 'అమృతారామమ్' '47 డేస్' 'కృష్ణ అండ్ హిజ్ లీల' 'భానుమతి అండ్ రామకృష్ణ' వంటి చిన్న సినిమాలతో పాటు 'పెంగ్విన్' అనే డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది. ఒకవైపు బాలీవుడ్ లో పెద్ద సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డేర్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. నాని - సుధీర్ బాబు 'వి'.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'.. రామ్ పోతినేని 'రెడ్'.. అనుష్క 'నిశ్శబ్దం'.. యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలు షూటింగ్స్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఓటీటీ రిలీజ్ కి ముందుకు రావడం లేదట.

అయితే బాలీవుడ్ సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్న ఓటీటీలు తెలుగు సినిమాలకు ఇవ్వడానికి ముందుకురావడం కూడా ఓ కారణం అయ్యుండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రిలీజైన తెలుగు చిత్రాలకు అంచనా వేసిన స్థాయిలో వ్యూస్ రావట్లేదని.. ఇక్కడ సబ్ స్క్రైబర్స్ కూడా పెరగట్లేదని ఓటీటీలు భావిస్తున్నాయట. అందుకే మన సినిమాలకు భారీ మొత్తంలో చెల్లించడానికి వారు వెనకడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కాకపోతే ఇప్పటి వరకు రిలీజైన సినిమాలన్నీ చిన్న సినిమాలు.. క్రేజ్ అంతగా లేని సినిమాలు. ఒకవేళ పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తే వ్యూవర్ షిప్ పెరగడంతో పాటు సబ్ స్క్రై బర్స్ పెరుగుతారేమో అని ఓటీటీలు ఆలోచిస్తే బాగుంటుంది. అప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా డేర్ గా తమ సినిమాలని ఓటీటీ రిలీజ్ చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది.