పాపం.. ఆ దర్శకుల ఆశలపై మహమ్మారి నీళ్లు చల్లిందిగా...!

Sun Jul 12 2020 20:20:00 GMT+0530 (IST)

Pandemic Effect On Directors

కరోనా మహమ్మారి వలన నష్టపోయిన రంగాలలో సినీ రంగం ఒకటి. గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ మూతపడిపోయి ఉండటంతో సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలన్నీ నానా అవస్థలు పడుతున్నాయి. సినిమాలపై కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్స్ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ క్రమంలో కొందరు నటీనటులు జూనియర్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ కూడా సినిమాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ వైరస్ వలన కొంతమంది డైరెక్టర్ల కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా గత చిత్రాలు నిరాశపరచడంతో ఎలాగైనా నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలన్న కసితో సినిమాలు తీస్తున్న దర్శకుల ఆశలపై మహమ్మారి నీళ్లు చల్లింది.మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నెక్స్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని తన మీద ఉన్న నెగిటివిటీని దూరం చేసుకోవాలనే కసితో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ చేసారు. అయితే కరోనా వచ్చి బోయపాటి స్పీడ్ కి బ్రేక్స్ వేసింది. ఇక ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసాడు. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ తో 'అసురన్' రీమేక్ కి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఎలాగైనా 'నారప్ప' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని ఆశపడ్డాడు. కానీ కరోనా వచ్చి కాటు వేసింది.

'బొమ్మరిల్లు' సినిమాతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన భాస్కర్ ఏడేళ్ల తర్వాత తెలుగులో సినిమా తెరకెక్కిస్తున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాతో ఎలాగైనా టాలీవుడ్ లో మళ్ళీ పాగా వేయాలని ప్లాన్స్ వేసుకున్నాడు. అయితే మహమ్మారి వచ్చి ప్లాన్స్ అన్ని తారుమారు చేసింది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'సైరా నరసింహారెడ్డి' అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంతో నెక్స్ట్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేయాలనుకున్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా అనౌన్స్ చేయడమే కష్టంగా మారింది. 'మహర్షి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి ఈ ఏడాది తదుపరి సినిమా పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ కుదరలేదు.

'మిస్టర్ మజ్ను' సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి నితిన్ తో 'రంగ్ దే' సినిమాతో హిట్ డైరెక్టర్ అనిపించుకోవాలని ఆశపడ్డాడు. 'Rx 100' సినిమా తర్వాత అధికారికంగా మరో ప్రాజెక్ట్ ప్రకటించని అజయ్ భూపతి ఈ ఏడాదైనా తన 'మహా సముద్రం' స్టార్ట్ చేయాలని భావించారు. 'సవ్యసాచి' సినిమాతో పరాజయాన్ని రుచి చూసిన చందూ మొండేటి 'కార్తికేయ 2' సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ అందుకోవాలని చూసాడు. ఇలా ప్రతి డైరెక్టర్ ఇండస్ట్రీలో తమని తాము నిరూపించుకోవాలని ప్లాన్స్ వేసుకున్న తరుణంలో కరోనా మహమ్మారి వచ్చి తారుమారు చేసేసింది. ఇప్పుడు ఈ దర్శకులకు అర్జంటుగా ఒక హిట్ సినిమా కావాలి. కానీ మహమ్మారి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతూ వారి సినిమాలను వాయిదా వేసుకుంటూ పోయేలా చేస్తోంది.