స్పెషల్ స్టోరీ : టాలీవుడ్.. ఓ బంగారు బాతు గుడ్డు

Thu May 12 2022 17:00:01 GMT+0530 (IST)

Pan India Movies in Tollywood

దర్శకధీరుడు రాజమౌళి `బాహుబలి` మూవీ ఏ మూహూర్తాన ప్రారంభించాడో కానీ అదే టాలీవుడ్ దశని దిశని సమూలంగా మార్చేసింది. టాలీవుడ్ చరిత్ర గురించి చెప్పుకుంటే రాజమౌళి `బాహుబలి` తరువాత టాలీవుడ్ లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. అప్పటి వరకు యూట్యూబ్ డబ్బింగ్ కోసం మాత్రమే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఎంతో కొంత ఇచ్చి తీసుకునే పరిస్థితి వుండేది. కానీ `బాహుబలి` తరువాత అది కోట్లు ఇచ్చి తీసుకునే స్థాయికి చేరింది. ఇది రాజమౌళి సాధించిన ఘనత అని చెప్పుకోవాల్సిందే. ఈ దర్శకుడి ప్రయత్నం తరువాతే తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో టాలీవుడ్ బంగారు బాతుగా మారింది.కాసుల వర్షం కురుస్తోంది. రైట్స్ పరంగా భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఎక్కడా చూసినా ఇప్పడు మన సినిమా గురించే చర్చ మొదలైంది. తెలుగు సినిమా గురించి యావత్ భారతం గొప్పగా చెప్పుకుంటున్నారు. దీంతో మన వాళ్లలో చైతన్య మొదలైంది. చాలా వరకు స్టార్ హీరోలు భారీ అతి భారీ చిత్రాల నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మన సినిమాకు పెరిగిన డిమాండ్ ని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కోట్లు కుమ్మరిస్తూ భారీ బడ్జెట్ లతో సినిమాలని రెడీ చేస్తున్నారు. ద్విభాషా చిత్రాల్లో నటించని స్టార్స్ కూడా ఇప్పడు కదిలిస్తే ద్విభాషా చిత్రం అంటున్నారు.

ఇక చాలా మంది పాన్ ఇండియా సినిమాలపై కన్నేశారు కూడా. ఇప్పటికే కొన్ని నిర్మాణ దశలో వుండగా మరి కొన్ని త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. కొన్ని సైలెంట్ గానే షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ `సలార్` ఆది పురుష్ ప్రాజెక్ట్ కె నేచురల్ స్టార్ నాని `దసరా` ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` విజయ్ దేవరకొండ `లైగర్` అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న `ఏజెంట్` కూడా పాన్ ఇండియా కోసం రెడీ అవుతోంది. కారణం ఇందులో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు కాబట్టి. ఇక నిఖిల్ `స్పై` కూడా పాన్ ఇండియా సినిమా అంటూ మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

సందీప్ కిషణ్ హీరోగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న `మైఖేల్` కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు కూడా. ఇక `ట్రిపుల్ ఆర్` పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ - శంకర్ తో చేస్తున్న సినిమా ఎన్టీఆర్ - కొరటాల శివతో చేయబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇక్కడి వరకు అంతా బాగానే వుంది. రాజమౌళి వేసిన బాటలో తమ మార్కెట్ ని పెంచుకుంటూ చాలా మంది స్టార్ లు పాన్ ఇండియా సినిమాలని ప్లాన్ చేసుకున్నారు.

దీంతో ఇప్పడు టాలీవుడ్ ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా మారి టాప్ లో నిలిచింది. మన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయల్ని వసూలు చేస్తూ దక్షిణాదికి సవాల్ గా మారాయి. అయితే మనం దీన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నామా? అన్నదే ఇప్పడు ప్రశ్నగా మారింది. పాన్ ఇండియా రేంజ్ కి మన తెలుగు సినిమా ఎదిగింది. కానీ దాన్ని నిలుపుకునే క్రమంతో మన వాళ్లు తప్పటడుగులు మొదలు పెట్టారు. సరైన కంటెంట్ ని ఎంచుకోకుండా భారీ బడ్జెట్ తో కోట్లు కుమ్మరించి సినిమాలు చేయడం.. రిలీజ్ కు కనీసం మూడు వారాలైనా గ్యాప్ తీసుకోకుండా రెండు వారాలకే రంగంలోకి దింపేయడంతో ఓ మోస్తారు వసూళ్లని రాబట్టి లాభాలు లేకుండా సేఫ్ లోకి వెళ్లాల్సిన ఫ్లాప్ సినిమాలు కూడా వందల కోట్ల వరకు నష్టాలని చవి చూస్తున్నాయి.

ఇటీవల విడుదల చేసిన రాధేశ్యామ్ ఆచార్య చిత్రాల పరిస్థితి ఇందుకు అద్దంపడుతోంది. కంటెంట్ సరిగా చూసుకోకపోవడం ఓ కారణం కాగా భారీ పోటీలో ఈ చిత్రాలని రిలీజ్ చేయడం మరో కారణంగా నిలిచింది. బంగారు బాతుగా మారిన టాలీవుడ్ ని క్యాష్ చేసుకోవాలనే తొందర పాటులో మన వాళ్లు తప్పులు చేయడం మొదలు పెట్టారు. ఇటీవల భారీ డిజాస్టర్ లుగా నిలిచిన చిత్రాల విషయంలో కంటెంట్ ప్రధాన పాత్ర పోషించగా.. సరైన టైమ్ రిలీజ్ మరో కారణంగా నిలిచింది. ఇక్కడ మరో కోణం కూడా వుంది. కరోనా కారణంగా దాదాపుగా రెండేళ్ల పాటు భారీ చిత్రాల నుంచి చిన్న సినిమాలు రిలీజ్ కు నోచు కోలేదు.

ఏళ్ల తరబడి రిలీజ్ లు వాయిదా పడటంతో వడ్డీలు తడిసిమోపెడయ్యాయి. దాని నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనలో మన వాళ్లు రెండు వారాల గ్యాప్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ధియేటర్లకు వదిలారు. దీంతో కంటెంట్ ఓహో అనిపించినవి సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. పాన్ ఇండియా హిట్ లుగా నిలిచయాయి. కంటెంట్ ప్రాపర్‌గ ఆలేకుండా కేవలం స్టార్ కాస్టింగ్ గ్రాండీయర్ మేకింగ్ పై మాత్రమే దృష్టిపెట్టిన రాధేశ్యామ్ ఆచార్య గని వంటి చిత్రాలు భారీ డిజాస్టర్ లుగా మిగిలాయి. ఈ తొందర పాటు రిలీజ్ ల వల్ల ఫ్లాప్ సినిమా కూడా కలెక్షన్ లని సాధించలేకపోతోంది.

ఒక దశలో `జానీ` అత్యంత డిజాస్టర్ గా నిలిచినా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించకపోవడానికి ప్రధాన కారణం అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసి రెండు వారాలు ఆడినా చాలు అందినంత సర్దేద్దాం అనే ధోరణి పెరిగిపోవడమే. ఇదే థోరణి కంటిన్యూ అయితే టాలీవుడ్ అనే బంగారు బాతును ఇన్ స్టంట్ గా గుడ్డు కావాలని కోసినట్టే అవుతుంది.

- రవి గోరంట్ల