పాన్ ఇండియా కౌంటర్స్.. మన పరువు మనమే తీసుకుంటున్నాం

Sun May 15 2022 13:00:01 GMT+0530 (IST)

Pan? India Counters In Tollywood

ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తెలుగు మరియు తమిళ... కన్నడ సినిమాలను హిందీ ప్రేక్షకులు వందల కోట్ల వసూళ్లు ఇచ్చి మరీ పాన్ ఇండియా సినిమాలుగా మార్చి సూపర్ హిట్స్ ను ఇస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు అక్కడ విజయాన్ని సొంతం చేసుకున్నప్పుడు మరిన్ని సినిమాలను అక్కడ విడుదల చేయడం తప్పులేదు.మంచి కంటెంట్ ఉండి అక్కడ ఆకట్టుకుంటాయి అనే నమ్మకం ఉంటే తప్పకుండా బాలీవుడ్ లో విడుదల చేయవచ్చు. అక్కడ ఇక్కడ గుర్తింపు ఉన్న హీరోలను పాన్ ఇండియా స్టార్ హీరోలుగా పిలవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కాని పాన్ ఇండియా స్టార్ హీరో అనే ఇమేజ్ ఉన్న వారిని కొందరు విమర్శిస్తున్నారు. మీడియాలో లేదా సోషల్ మీడియాలో విమర్శిస్తే ఏమో కాని ఏకంగా సినిమాల్లోనే విమర్శిస్తున్నారు.

పాన్ ఇండియా అనే పదం ఈమద్య కాలంలో సీరియస్ కాకుండా సిల్లీ అయ్యింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సర్కారు వారి పాట సినిమా లో వెన్నెల కిషోర్ తో పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అంటూ డైలాగ్ చెప్పించడంతో పాటు.. తాజాగా ది వారియర్ సినిమా లో పాన్ ఇండియా రౌడీ ని నేను అంటూ డైలాగ్ చెప్పించడం కూడా విమర్శలకు తెర తీసినట్లు అయ్యింది.

మన హీరోలు ఒకటి రెండు సినిమాలతో అక్కడ సక్సెస్ అవ్వడం.. ఆ తర్వాత నిరాశ పర్చడం తో పాన్ ఇండియా స్టార్ డమ్ ఏమీ తగ్గి పోదు. కాని కొందరు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసి ప్లాప్ అయ్యాడు.. అతడు పాన్ ఇండియా స్టార్ ఎలా అవుతాడు అంటూ కిందకు లాగే ప్రయత్నాలు చేస్తున్నాడు.

దక్షిణాది హీరోకు ఉత్తర భారతంలో గుర్తింపు ఉండి.. స్టార్ డమ్ ఉంటే ఖచ్చితంగా ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. ఆ స్టార్ కాస్త భారీ బడ్జెట్ తో సినిమా చేస్తే అది పాన్ ఇండియా మూవీ అవుతుంది. అయితే చిన్న హీరోలు కొత్త దర్శకులు కూడా పాన్ ఇండియా అనడం వల్లే ఇప్పుడు ఈ గొడవ అంతా వస్తుంది.

చిన్న సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం అనేది కాస్త అతి అయినా కూడా ఇక్కడ సక్సెస్ అయ్యి అక్కడ కూడా నడుస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే విడుదల చేయాలి. అంతే తప్ప పాన్ ఇండియా పేరుతో మన పరువు మనమే తీసుకోవద్దు అంటూ సినీ ప్రియులు విజ్ఞప్తి చేస్తున్నారు.