Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘పక్కా కమర్షియల్’

By:  Tupaki Desk   |   1 July 2022 8:30 AM GMT
మూవీ రివ్యూ :  ‘పక్కా కమర్షియల్’
X
చిత్రం :‘పక్కా కమర్షియల్’

నటీనటులు: గోపీచంద్-రాశి ఖన్నా-సత్యరాజ్-రావు రమేష్-ప్రవీణ్-శియ గౌతమ్-అజయ్ ఘోష్-చిత్ర శుక్లా-శుభలేఖ సుధాకర్-సప్తగిరి-వైవా హర్ష తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: కర్మ్ చావ్లా
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: మారుతి

కామెడీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన మారుతి.. యాక్షన్ సినిమాలకు కేరాప్ అడ్రస్ అయిన గోపీచంద్ తొలిసారి కలిసి చేసిన సినిమా ‘పక్కా కమర్షియల్’. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించింది. మరి ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

తాను ఇచ్చిన తీర్పు కారణంగా అమాయకురాలైన ఓ అమ్మాయి ప్రాణం పోయిందన్న ఆవేదనతో జడ్జి పదవికి రాజీనామా చేసి కిరాణా కొట్టు నడుపుకోవడం మొదలుపెడతాడు సూర్య నారాయణ (సత్యరాజ్). అతడి కొడుకు లక్కీ (గోపీచంద్) పెరిగి పెద్దవాడై.. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ లాయర్ అవుతాడు. కానీ అతను తండ్రి మనస్తత్వానికి పూర్తి విరుద్ధంగా.. పక్కా కమర్షియల్ అన్నమాట. కోరుకున్నంత ఫీజిస్తే.. ఎంత పెద్ద నేరం చేసిన వారి తరఫున అయినా వాదించి వారి కేసు గెలిపించేస్తాడు లక్కీ. అలాంటి లక్కీ తన తండ్రి జడ్జి పదవిని వదులుకోవడానికి కారణమైన వివేక్ (రావు రమేష్) పంచన చేరతాడు. అతడి కోసం ఓ కేసు కూడా టేకప్ చేస్తాడు. కొడుకు నిజ స్వరూపం తెలుసుకున్న సూర్య నారాయణ.. ఆ కేసులో వివేక్ బాధితుల వైపు నిలుస్తాడు. మరి ఈ తండ్రీ కొడుకుల పోరులో గెలిచిందెవరు? చివరికి లక్కీలో అసలు మార్పు వచ్చిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక కేసులో ఒక అమాయకుడికి శిక్ష పడినా.. ఒక నేరస్థుడు ఏ శిక్ష లేకుండా బయటికి వచ్చేసినా.. అందుకు జడ్జి బాధ్యుడు అవుతాడా? లాయర్ల వాదనను బట్టి.. పోలీసుల ప్రవేశ పెట్టిన సాక్ష్యాధారాల్ని బట్టి జడ్జీలు తీర్పిస్తారు తప్పితే.. వాళ్లు సొంతంగా తీసుకునే నిర్ణయం ఏముంటుంది? ఇక్కడసలు వ్యక్తిగతంగా ఫీలవడానికి ఏమీ ఉండదు. కానీ ‘పక్కా కమర్షియల్’లో జడ్జి అయిన హీరో తండ్రి మాత్రం తాను ఇచ్చిన తీర్పు వల్ల ఒక అమాయకురాలికి అన్యాయం జరిగిందని.. తన పదవిని వదిలేస్తాడు. ఇలా లాజిక్ లేకుండా మొదలవుతుంది ‘పక్కా కమర్షియల్’. ఐతే కామెడీ ప్రధానంగా సాగే సినిమా అంటే లాజిక్ తీసి అటక మీద పెట్టేయాలి కాబట్టి సర్దుకోవచ్చు. కానీ కథను సీరియస్ గా చెప్పాల్సిన చోట కూడా లాజిక్ గురించి అస్సలు ఆలోచించకుండా.. కామెడీ పేరుతో చేసిన విన్యాసాల వల్ల ‘పక్కా కమర్షియల్’ ఏ దశలోనూ సీరియస్ గా తీసుకోలేని విధంగా తయారైంది. అలా అని కామెడీ అయినా అనుకున్నంతగా వర్కవుట్ అయిందా అంటే అదీ లేకపాయె. సినిమా చివరి దశలో కొన్ని మెరుపులు.. అక్కడక్కడా కొన్ని నవ్వులు మినహాయిస్తే.. ‘పక్కా కమర్షియల్’లో చెప్పుకోదగ్గ విశేషాల్లేవు. మారుతి వీకెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలవడానికి ‘పక్కా కమర్షియల్’ గట్టి పోటీదారే.

ఈ మధ్యే ఒక సినీ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ఏ జానర్ సినిమా తీసినా ఫుల్ ప్లెడ్జ్డ్‌ గా చేయాలని.. కామెడీ సినిమా చేస్తే పొట్ట చెక్కలయ్యే స్థాయిలో నవ్వించాలని.. యాక్షన్ సినిమా చేస్తే గ్రేటెస్ట్ ఫైట్లు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ‘పక్కా కమర్షియల్’లో మారుతి తన మార్కు కామెడీ పండించడానికి.. అలాగే కొద్దిగా గోపీచంద్ మార్కు యాక్షన్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఐతే తెర నిండా బోలెడంత మంది కమెడియన్లను పెట్టి ప్రతి పాత్రనూ కామెడీగానే తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు కానీ.. బేసిగ్గా నవ్వులు పండడానికి అవసరమైన బలమైన సందర్భాల్ని అతను సృష్టించలేకపోయాడు. యాక్షన్ విషయానికి వస్తే మారుతి గోపీతో స్టైలిష్ ఫైట్లయితే చేయించాడు కానీ.. వాటిలో ఫైట్ చేయాల్సిన అవసరం కానీ.. ఆ ఎమోషన్ కానీ కనిపించదు. దీంతో ఇటు కామెడీ అనుకున్నంత పండక.. అటు హీరోయిజం కూడా అవ్వాల్సినంత ఎలివేట్ అవక ‘పక్కా కమర్షియల్’ సాధారణంగా తయారైంది. కథ పరంగా చూసినా కొత్తదనం కనిపించదు. చివరికి చూస్తే ఇదొక సగటు రివెంజ్ డ్రామా. నెగెటివ్ షేడ్స్ ఉన్నట్లుగా హీరోను చూపించి.. చివర్లో ట్విస్టుతో అతనలా ప్రవర్తించడానికి కారణం చూపించి విలన్ మీద ప్రతీకారం తీర్చుకునేలా చేసే ఫార్మాట్ ఎన్నో సినిమాల్లో చూసిందే.

‘పక్కా కమర్షియల్’ ప్రోమోలు చూస్తే.. కథ సంగతెలా ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ కు ఢోకా ఉండదనే అనిపించింది. మారుతి మార్కు వినోదం సినిమాను నిలబెట్టేస్తుందనిపించింది. ఐతే మారుతి ఓవర్ ద టాప్ కామెడీతో నవ్వించడానికి గట్టిగానే ప్రయత్నించాడు కానీ అనుకున్నంతగా నవ్వులు పండలేదు. జాతిరత్నాలు.. డీజే టిల్లు లాంటి సినిమాలతో ప్రభావితం అయ్యాడేమో తెలియదు కానీ.. వాటిలో మాదిరే లాజిక్ గురించి పట్టించుకోకుండా క్రేజీగా సీన్లను నడిపించి కామెడీ చేద్దామనిచూశాడు మారుతి. కానీ చాలా కొన్ని సీన్లు మాత్రమే ప్రేక్షకులను నవ్వించగలిగాయి. టైటిల్నిజస్టిఫై చేసేలా హీరో పక్కా కమర్షియల్ అండ్ కన్నింగ్ అని చూపించే ఆరంభ సన్నివేశాల్లో కొత్తదనం కనిపించదు. ఇక సీరియల్లో తన పాత్రను చంపేశారని కోర్టులో కేసు వేసే నటిగా రాశి ఖన్నా పాత్ర ఆరంభంలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రను కూడా సరిగా వాడుకోలేకపోయాడు మారుతి. కాసేపటికే చాలా మామూలుగా తయారవుతుంది ఆ క్యారెక్టర్. ఆమెతో ముడిపడ్డ కోర్టు సీన్లు మరీ సిల్లీగా తయారయ్యాయి. హీరో హీరోయిన్ల ట్రాక్ అసలు వర్కవుట్ కాలేదు. తండ్రీ కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింటే కొంతమేర సినిమాను ముందుకు నడిపిస్తుంది.

బాగా కమర్షియల్ గా తయారైన కొడుకును సవాలు చేస్తూ పాతికేళ్ల తర్వాత తండ్రి నల్ల కోటు తొడగడంతో ఈ తండ్రీ కొడుకుల పోరు రసవత్తరంగా ఉంటుందని ఆశిస్తాం. కానీ సీరియస్ గా సై అంటే సై అన్నట్లుగా సాగాల్సిన ఈ ఫైట్ చాలా సాధారణంగా సాగిపోయింది. ఎంతసేపూ కొడుకు ఎలివేట్ కావడమే తప్ప.. తండ్రి మామూలోడు కాదు అనిపించే ఒక్క కోర్ట్ సీన్ కూడా లేకపోయింది. ఆయన వైపు నుంచి సరైన వాదనే కనిపించదు తండ్రికి మద్దతుగా సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన వారిని కొడుకు ఆయన ముందే డబ్బుతో కొనడం లాంటి సిల్లీ సీన్ల పుణ్యమా ఇంటెన్సిటీ ఫీల్ కాలేం. ఎక్కడా అసలు కథను సీరియస్ గా తీసుకునేందుకు అవకాశం లేకపోయింది. ఒక దశలో ప్రహసనంలా తయారైన ‘పక్కా కమర్షియల్’ చివరి 20 నిమిషాల్లో మాత్రం ఎంగేజ్ చేస్తుంది. హీరో పాత్రలోని ట్విస్ట్ చాలాసార్లు చూసిన తరహాలోనే ఉన్నప్పటికీ.. ఆ సన్నివేశాల్లో మారుతి కొంచెం మెరుపులు మెరిపించాడు. రావు రమేష్ మంత్రిగా ప్రమాణం చేస్తూ అడ్డంగా దొరికిపోయే సీన్లో అజయ్ ఘోష్ తో చేయించిన కామెడీ కూడా బాగానే వర్కవుట్ అయింది. ఇలా ఆఖర్లో ‘పక్కా కమర్షియల్’ కొంత ఎంగేజ్ చేస్తుంది. కానీ ఈ ఆఖరి మెరుపులు ఓవరాల్ గా సినిమా మీద ఇంప్రెషన్ని ఏమాత్రం మారుస్తాయన్నదే సందేహం.

నటీనటులు:

గోపీచంద్ తన కెరీర్లో అత్యంత స్టైలిష్ గా.. ట్రెండీగా కనిపించిన సినిమాల్లో ఒకటిగా ‘పక్కా కమర్షియల్’ నిలుస్తుంది. చాలా ఏళ్లుగా సరైన విజయం లేకపోయినా ఈ చిత్రంలో చాలా హుషారుగా నటించాడు గోపీ. ‘లౌక్యం’ రోజులను గుర్తు చేస్తూ ఎంటర్టైన్మెంట్ పండించడానికి శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. తన స్టయిల్లో మంచి ఫైట్లు కూడా చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న లక్కీ పాత్రలో అతను సులువుగానే ఒదిగిపోయాడు. తన అభిమానులను గోపీ బాగానే అలరించాడు. రాశి ఖన్నా ‘ప్రతి రోజూ పండగే’ తర్వాత మరోసారి కామెడీ క్యారెక్టర్లో కనిపించింది. కానీ ఆమె పాత్ర ఆరంభం బాగున్నా.. తర్వాత తేలిపోయింది. రాశి పాటల్లో చాలా గ్లామరస్ గా కనిపించింది. సత్యరాజ్ సూర్యనారాయణ పాత్రకు సరిపోయాడు. ఐతే నటన పరంగా అంత ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. రావు రమేష్.. స్టైలిష్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆయన లుక్.. నటన ఆసక్తికరంగా అనిపిస్తాయి. రావు రమేష్ మార్కు ఎటకారం ఆ పాత్రకు ప్లస్ అయింది. అజయ్ ఘోష్ కొంత నవ్వించాడు. శియ గౌతమ్ వ్యాంప్ తరహా పాత్రలో ఓకే అనిపించింది. ప్రవీణ్ సహాయ పాత్రలో అలవాటైన రీతిలో నటించాడు. సప్తగిరి.. హర్ష అనుకున్నంతగా నవ్వించలేకపోయారు.

సాంకేతిక వర్గం:

సాధారణంగా మారుతి సినిమాల్లో పాటలు బాగుంటాయి. సినిమాకు ప్లస్ అవుతుంటాయి. కానీ ఈసారి జేక్స్ బిజోయ్ లాంటి టాలెంటెడ్ మ్యుజీషియన్ తో జట్టు కట్టినా సరైన ఔట్ పుట్ రాబట్టుకోలేకపోయాడు. మారుతి సినిమాలన్నింట్లో వీకెస్ట్ ఆల్బం ఇదే అని చెప్పొచ్చు. పాటల్లో ఒక్కటీ గుర్తుంచుకునేలా.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. కర్మ్ చావ్లా ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్ ప్రమాణాలకు తగ్గట్లే ఉన్నాయి. మారుతి రచయితగా.. దర్శకుడిగా తన స్థాయికి ఔట్ పుట్ ఇవ్వలేదు. ఏపీలో మూడు రాజధానుల టాపిక్ తో ముడిపడ్డ సంభాషణ సహా కొన్ని చోట్ల ట్రెండీ డైలాగులైతే రాశాడు కానీ.. ఓవరాల్ గా అతడి పెన్ను మెరుపులు మెరిపించలేకపోయింది. ఎప్పుడూ ప్రధాన పాత్రధారుల క్యారెక్టరైజేషన్లతోనే మార్కులు కొట్టేసే మారుతి.. ఈసారి ఆ విషయంలో తన బలాన్ని చూపించలేకపోయాడు. కొన్ని కామెడీ సీన్లు.. పతాక సన్నివేశాల్లో మినహాయిస్తే మారుతి మార్కు కనిపించలేదు.

చివరగా: పక్కా కమర్షియల్.. తగ్గిన ఫన్ లెవెల్

రేటింగ్-2.5/5