Begin typing your search above and press return to search.

పాక్ సీరియల్స్ లో ఆ సీన్లు ఉండకూడదట.. మనం ఫాలో అయితే మంచిది

By:  Tupaki Desk   |   24 Oct 2021 12:30 AM GMT
పాక్ సీరియల్స్ లో ఆ సీన్లు ఉండకూడదట.. మనం ఫాలో అయితే మంచిది
X
కాలం మారింది. వినోదాల వేదికలు మారాయి. గతంలో టీవీ అంటే.. పరిమితంగా రోజుకు నాలుగైదు గంటలే ప్రసారాలు వచ్చేవి. మారే కాలంతో పాటు.. పరిమితం కాస్తా అపరిమితంగా కావటమే కాదు.. వందలాది చానళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం కూడా వచ్చేసింది. దీంతో.. వినోదానికి ఎల్లలు లేకుండా పోయింది. అంతేకాదు.. బుల్లితెర మీద వచ్చే సీరియల్స్.. ఓటీటీ కంటెంట్ లో సినిమాల్లో వచ్చే సీన్లకు మించిన హాట్ సీన్లు ఈ మధ్యన మొదలయ్యాయి.

ఇలాంటి పరిస్థితే దాయాది పాక్ లోనూ మొదలైందట. టీవీ సీరియల్స్ లో రొమాంటిక్ సీన్లు ప్రసారమవుతున్న వేళ.. అలాంటి వాటికి చెక్ పెట్టేలా పాక్ ప్రభుత్వం తాజాగా కఠిన ఆదేశాల్ని జారీ చేసింది. దీని ప్రకారం పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వుల ప్రకారం సీరియల్స్ లో కొన్ని సీన్లకు పూర్తిగా పరిమితులు పెట్టేశారు. కౌగిలించుకోవటాలు.. ఒకరినొకరు లాలించుకోవటం.. వివాహేతర సంబంధాలు.. పడకగది సీన్లు.. భార్యభర్తల మధ్య వచ్చే బెడ్రూం సీన్లు.. అసభ్యకరంగా దుస్తులు ధరించటం లాంటివి పాకిస్తానీ సమాజం.. కల్చర్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం కిందకే వస్తుందని.. అలాంటి వాటిని ప్రసారం చేయటానికి ముందు చానల్ లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మాత్రమే ప్రసారం చేయాలని పేర్కొన్నారు.

దీనిపై అక్కడి మానవ హక్కుల వాదులు సైతం ఈ నిర్ణయం సరైనదని.. కల్చర్ ను కాపాడుకోవటానికి ఇలాంటి ఆదేశాలు మంచివని చెబుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మన దేశంలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఎక్కువగా వివాహేతర సంబంధాలు.. పగలు.. ప్రతీకారాలు.. కుటుంబంలోని హింసతో పాటు మహిళల్ని విలన్స్ లా చూపించటం.. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో అయితే.. మితిమీరిన రొమాంటిక్ సీన్లు వస్తున్నవేళ.. మనం కూడా పాక్ లో మాదిరి కొన్ని పరిమితుల గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.