రానా వదిలిన సస్పెన్స్ - క్రైమ్ థ్రిల్లర్ 'పచ్చీస్' ట్రైలర్..!

Wed Jun 09 2021 19:00:02 GMT+0530 (IST)

Pachchis Trailer Talk A Dark Suspense Filled Crime Thriller

టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ''పచ్చీస్''. ఇందులో శ్వేతావర్మ హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ కృష్ణ & రామ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. అవాసా చిత్రం మరియు రాస్తా ఫిలిమ్స్ పతాకాలపై కౌశిక్ కుమార్ కత్తూరి - రమా సాయి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రాన్ని జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'పచ్చీస్' ట్రైలర్ ను హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.'చిన్న చిన్నవి చాలానే చేసా.. ఈసారి ఏదైనా పెద్దగా చేయాలి అనుకుంటున్నా' అంటూ హీరో రామ్స్ తన గొంతుకు గన్ గురి పెట్టుకోవడంతో ట్రైలర్ ప్రారభమైంది. ఇందులో రామ్స్ జీవితంలో ఏదైనా పెద్దగా చేయాలని ఆశపడి ఓడిపోయిన వ్యక్తిగా.. అనుకోని పరిస్థితుల్లో ఓ క్రైమ్ లో చిక్కుకున్న యువకుడిగా కనిపిస్తున్నాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే.. సినిమా అద్భుతమైన సాంకేతికతతో తెరకెక్కినట్లు అర్థం అవుతోంది.

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పరమర్ అందించిన విజువల్స్.. స్మరన్ సాయి సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. దర్శకులు శ్రీ కృష్ణ & రామ సాయి తొలి ప్రయత్నంగా యునిక్ క్రైమ్ థ్రిల్లింగ్ కథాంశాన్ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రానా ప్రతాప్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జయ చంద్ర - రవి వర్మ - శుభలేఖ సుధాకర్ - దయానంద్ రెడ్డి - కేశవ్ దీపక్ - విశ్వేందర్ రెడ్డి తదితరులు నటించారు. ఓటీటీలో ఈ నెల 12న విడుదల కానున్న 'పచ్చీస్' సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.