తంబీలకేనా స్వాభిమానం మనకు లేదా?

Sun Sep 15 2019 10:15:33 GMT+0530 (IST)

Pa Ranjith Stop Hindi imposition and address people real issues

ఒకరి ఉద్ధేశాన్ని.. కోరికను మందిపై  రుద్దేస్తామంటే ఊరుకుంటారా?  పైగా కోట్లాదిగా ఉన్న ప్రజలపై రుద్దే తంతును సహించగలరా?  మా మాటకు ఎదురే లేదు. మేం పట్టిన కుందేటికి మూడేకాళ్లు! అన్నట్టే కొందరు రాజకీయనాయకులు వ్యవహరిస్తుంటారు. దిల్లీ లీడర్ నుంచి గల్లీ లీడర్ వరకూ ఇదే తీరు. గెలవక ముందు ఒక మాట.. గెలిచిన తరువాత మరో మాట మాట్లాడుతూ జనాల సహనాన్ని పరీక్షిస్తున్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు ఇందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తున్నారు. తమకు మాత్రమే నచ్చిన ఏదో ఒక వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్నే యావత్ భారతం పాటించాలని పట్టడం వీళ్లకే చెల్లింది. సాక్ష్యాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇలాంటి ప్రకటనే శనివారం చేయడంతో దక్షిణాది ఒక్కసారిగా భగ్గుమంది. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా `ఒకే దేశం ఒకే భాష` అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు అమిత్ షా.



దీనిపై ముందుగా తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అమిత్ షా వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడి `ఇది ఇండియానా? హిందీయానా? అని కౌంటరిచ్చారు. సామాజిక సమస్యలపై సోషల్ మీడియాలో కేవలం తమిళ భాషలో మాత్రమే స్పందించే దర్శకుడు పా. రంజిత్ కేంద్రంపై తిరగుబాటు స్వరాన్ని వినిపించడం ఆసక్తికరంగా మారింది. స్థానికత.. స్వాభిమానానికి పెట్టింది పేరైన తంబీలే మరోసారి దక్షిణాది నుంచి స్పందించారు.

పా.రంజిత్ కౌంటర్ ఇలా ఉంది. `భారత్ భిన్న మతాలకు భిన్న భాషలకు నెలవు. ఇక్కడ ప్రతి భాషా ముఖ్యమే. కానీ తన అస్థిత్వాన్ని కాపాడే భాష కూడా ముఖ్యమే. `ఒకే భాష ఒకే దేశం` పేరుతో దేశాన్ని ఒక్కటి చేస్తున్నారా? లేక సమైక్యతకు  భంగం కలిగించబోతున్నారా?` అని కౌంటరిచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. `ఒకే భాష ఒకే దేశం` నినాదంపై టాలీవుడ్ సెలబ్రిటీలెవరూ ఇంతవరకూ దీనిపై స్పందించకలేదేమిటో. సోషల్ మీడియాలో ఏం మాట్లాడితే ఏది తగులుకుంటుందోనన్న భయంతో ఆచితూచి అడుగులేస్తున్నారా? అయినా తంబీలకేనా స్వాభిమానం మనకు లేదా?