ట్రైలర్ టాక్: ఫ్రెండే వైఫ్ గా వస్తే.. ఓరి దేవుడా..!

Fri Oct 07 2022 18:45:52 GMT+0530 (India Standard Time)

Ori Devuda Trailer

యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పలు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న 'మాస్ కా దాస్'.. ఇప్పుడు ''ఓరి దేవుడా..!'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.'ఓరి దేవుడా..!' సినిమాలో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ - ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా మేకర్స్ ఆవిష్కరించారు.

కోర్టులో అర్జున్ (విశ్వక్ సేన్) - అను (మిథిలా పాల్కర్) ల విడాకులు కేసు వాదనలతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వెంటనే 'బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్' అంటూ పూరీ జగన్నాథ్ ఎంట్రీ ఇచ్చాడు. విశ్వక్ తన గోడును దుస్థితిని వెంకీ కి చెప్తున్నట్లుగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

లవ్ మ్యారేజా? అరెంజ్ మ్యారేజా? అని వెంకీ అడగ్గా.. 'లవ్వే లేని లవ్ మ్యారేజ్' అని చెప్పే విధానం నవ్వు తెప్పిస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా తన ప్రేయసిని పెళ్లి చేసుకున్న విశ్వక్.. ఒక గమ్మత్తైన పరిస్థితిల్లో చిక్కుకున్నట్లు ట్రైలర్ ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ అతని మామగా మురళీ శర్మ కనిపించారు.

విశ్వక్ లైఫ్ లోకి తన సీనియర్ చిన్నప్పటి క్రష్ మీరా (ఆశా భట్) వచ్చిన తర్వాత అతని వైవాహిక జీవితంలో మరిన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కలహాలు వచ్చి విడిపోయినట్లు కనిపిస్తోంది. అయితే దేవుడైన వెంకటేష్ అతని లైఫ్ ని మార్చుకునేందుకు సెకండ్ ఛాన్స్ గా ఒక టికెట్ ని విశ్వక్ కి ఇచ్చాడు. అక్కడి ట్రైలర్ లో ఎమోషనల్ పార్ట్ ని చూపించారు.

ట్రైలర్ చివరల్లో 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండే వైఫ్ లాగా వచ్చిందా..?' అంటూ వెంకీకి దండం పెట్టి గట్టిగా విశ్వక్ చెప్పే డైలాగ్ తో ఈ సినిమాలో పాయింట్ ఏంటనేది తెలియజెప్పారు. ఇది యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశంగా కనిపిస్తుంది.

సమకాలీన అంశాలతో కలహాలు - మనస్పర్థలు - వారి మధ్య సంఘర్షణ నేపథ్యంలో.. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందించారని తెలుస్తోంది. ఇందులో విశ్వక్ మరియు మిథిల మంచి కెమిస్ట్రీని పంచుకుంటున్నారు. వెంకటేష్ ఎంతో స్టైలిష్ గా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు.

ట్రైలర్ కు లియోన్ జేమ్స్ సనకూర్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థీమ్ కు సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రాఫర్ విధు అయ్యన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి విజయ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. మొత్తం మీద ఈ ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోందని చెప్పాలి.

''ఓరి దేవుడా..!'' సినిమా తమిళ్ లో ఘనవిజయం సాధించిన 'ఓ మై కడవులే' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం.

పీవీపీ సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ''ఓరి దేవుడా..!'' సినిమాని రూపొందించారు. పెర్ల్ వి పొట్లూరి - పరమ్ వి పొట్లూరి - దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.