లండన్ లో హీరో సిద్ధార్థ్ కి ఆపరేషన్!

Fri Sep 24 2021 10:01:17 GMT+0530 (IST)

Operation for hero Siddharth in London

తెలుగు .. తమిళ భాషల్లో సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఆయన చేసిన సినిమాల్లో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?' .. 'బొమ్మరిల్లు' సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాలకి మంచి రేటింగ్ వస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో సిద్ధార్థ్ కి పెద్దగా అవకాశాలు లేవు. తమిళ సినిమాల అనువాదాలతోనే తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నాడు. తాజాగా ఆయన చేసిన సినిమా 'మహాసముద్రం'. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన శర్వానంద్ తో కలిసి నటించాడు.అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నుంచే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి అజయ్ భూపతి .. శర్వానంద్ .. అనూ ఇమ్మాన్యుయేల్ తో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈవెంట్ లో సిద్ధార్థ్ కనిపించకపోవడంతో కారణం ఏమై ఉంటుందా అని అంతా అనుకున్నారు.

కానీ సిద్ధార్థ్ ప్రస్తుతం ఇండియాలో లేడనీ .. లండన్ లో ఆయనకి ఒక చిన్న ఆపరేషన్ జరుగుతోందని అజయ్ భూపతి చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. సిద్ధార్థ్ ఎప్పుడు లండన్ వెళ్లాడు? .. దేనికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంటున్నాడు? అనేది మాత్రం తెలియదు. సాధారణంగా సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. కరెంట్ ఎఫైర్స్ కి సంబంధించిన విషయాలను గురించి ఆయన తన స్పందనను తెలియజేస్తూ ఉంటాడు. అలాగే రాజకీయాలకి సంబంధించిన అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటాడు.

అలాంటి సిద్ధార్థ్ తన సర్జరీకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆపరేషన్ ఏదైనా సక్సెస్ కావాలనీ .. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అదితీరావు కూడా హాజరు కాలేదు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో షూటింగులో ఉందనీ అందువల్లనే రాలేకపోయిందని అజయ్ భూపతి చెప్పాడు. ఈవెంట్ కి హాజరుకాలేక పోతున్నందుకు ఆమె చాలా ఫీల్ అవుతోందని కూడా అన్నాడు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో చూడాలి.