Begin typing your search above and press return to search.

అగ్ర హీరోలు పెద్ద‌ ద‌ర్శ‌కుల‌ గుండెల్లో రైళ్లు

By:  Tupaki Desk   |   22 Sep 2021 12:30 AM GMT
అగ్ర హీరోలు పెద్ద‌ ద‌ర్శ‌కుల‌ గుండెల్లో రైళ్లు
X
టిక్కెట్టు ధ‌ర‌ల స‌వ‌రణ .. ఆన్ లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏపీ ప్ర‌భుత్వం ర‌న్ చేయ‌డం వంటి అంశాలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ప్ర‌భుత్వంతో సినీపెద్ద‌లు స‌వ‌ర‌ణ‌లు కోరుతూ చ‌ర్చించినా ఫ‌ల‌వంతం కాలేదు. ఇక‌పై టిక్కెట్టు తెగితే ప్ర‌భుత్వ ఖ‌జానాకు ప‌న్ను చేరాల్సిందే అన్న తీరుగా వ్య‌వ‌హ‌రిస్తోంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. గ‌త ప్ర‌భుత్వాల త‌ర‌హాలో చూసీ చూడ‌న‌ట్టు పోయే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇది చాలామంది అగ్ర హీరోల‌కు అగ్ర ద‌ర్శ‌కుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక‌పై తాము అందుకునే భారీ పారితోషికాల‌కు గండి కొట్టే నిర్ణ‌యం ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతోంద‌ని వారంతా ఆందోళ‌న‌లో ఉన్న‌ట్టు మీడియాలో క‌థ‌నాలు వెలువడుతున్నాయి.

మునుముందు రిలీజ్ కి రానున్న‌ పెద్ద సినిమాలకు ఇది పెద్ద దెబ్బ‌గా మార‌నుంది. ఇక టిక్కెట్టు ధ‌ర‌లు పెంచినా పెంచ‌క‌పోయినా కానీ బెనిఫిట్ షోల‌ను పూర్తిగా ర‌ద్దు చేయాల‌న్న నిర్ణ‌యం మ‌రో పెద్ద పంచ్.
ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త విధానం విడుదల చేయడానికి సిద్ధంగా లేదు. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లోనే టిక్కెట్టు కొనాలి. ఇది చాలామంది నిర్మాతలకు సంతోషాన్ని కలిగిస్తోంది. వారు తమ ఆనందాన్ని బాహాటంగా వ్యక్తం చేయలేదు కానీ వారు ఇన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పెద్ద హీరోలు దర్శకుల అణచివేతల నుండి బయటపడవచ్చని తమలో తాము చర్చించుకుంటున్నారు.
అయితే తమ సినిమాలను విడుదల చేయబోతున్న పెద్ద నిర్మాతలు ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు.

బెనిఫిట్ షోలలో టిక్కెట్లను అత్యధిక ధరలకు విక్రయించవచ్చని భావించి వారు తమ హీరోలు డైరెక్టర్ లకు భారీ పారితోషికాల‌ను కట్టబెట్టారు. బ్రేక్ ఈవెన్ చేయడానికి మునుపటిలాగే మొదటి మూడు రోజుల్లో టికెట్ ధరలను పెంచి అమ్మాల‌నుకున్నారు. కానీ ఇక‌పై ఇది కుద‌ర‌దు. ఇప్పుడు సినిమా పెద్దదైనా చిన్నదైనా.. ప్రయోజన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం స‌సేమిరా అంటోంది. ఇంత‌కుముందులా ఎడాపెడా డబ్బు సంపాదించడానికి స్టార్ హీరోలకు బ్లాక్ మ‌నీని ఇవ్వడానికి కుద‌ర‌దు. ఆన్ లైన్ టికెట్ అమ్మకాలలో ప్రభుత్వం పెత్త‌నం చాలా మంది పెద్ద‌వాళ్ల ను తీవ్రంగా నిరాశపరిచింది.

ఇప్పుడు ప్రభుత్వం కఠినమైన నియమాలు పెద్ద హీరోలు పెద్ద దర్శకులకు ప్రతి సినిమాతో అద‌నంగా భారీ ఆదాయం సాధ్య‌ప‌డ‌దు. వారి అత్యాశకు చెక్ పెట్టేందుకే ఏపీ ప్ర‌భుత్వం స‌న్నాహ‌కాల్లో ఉంది. ఇక చిన్న నిర్మాత‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఊపిరి పోస్తుంటే ఆ నలుగురు లేదా ఆ ప‌ది మంది కి ఇది ఎంతో ఇబ్బందిక‌రం అన్న చ‌ర్చ సాగుతోంది. నిర్మాత‌లు కొంత‌వ‌ర‌కూ సంతోషంగా ఉన్నా అది భారీ పారితోషికాలు అందుకునే తార‌ల‌కు శ‌రాఘాతం కానుంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఆన్ లైన్ పైరసీ.. వినోదపు పన్ను.. సినీ కార్మికుల రోజువారీ వేతనాల పెరుగుదల.. ప్రత్యక్ష OTT విడుదలలు వ‌గైరా వ‌గైరా స‌మ‌స్య‌లు ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీని స‌మ‌స్య‌ల్లోకి నెట్టాయి. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు కూడా పెద్ద సినిమాలు తీసేవారికి పెద్ద హీరోల‌కు ఇబ్బందిక‌రం అన్న చ‌ర్చ ప్ర‌ముఖంగా సాగుతోంది. ఇన్నాళ్లు టిక్కెట్టు పేరుతో అభిమానులు ప్ర‌జ‌ల జేబుకు ఫుల్లుగా చిల్లు పెట్టిన ఒక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా శాసించే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం అడుగులు ఇంకా ఏ దిశ‌గా సాగుతాయో అన్న ఆవేద‌న కూడా ఒక సెక్ష‌న్ లో ఉంది. మునుముందు వినోద ప‌న్ను వ‌సూళ్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఎక్క‌డా త‌గ్గేట్టు మాత్రం క‌నిపించ‌డం లేద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.