మల్లువుడ్ లో కుర్చీలాట..టాప్ లో నిలిచేదెవరు?

Thu Jun 30 2022 23:00:01 GMT+0530 (IST)

One of these three is a stardom as a top hero of Mollywood

ప్రతీ ఇండస్ట్రీలోనూ కుర్చీలాట.. నెంబర్ గేమ్ కామన్ గా నడుస్తోంది. పైకి నెంబర్ గేమ్ లు మాకు పెద్దగా ఇష్టం వుండదని కలెక్షన్ ల గురించి పెద్దగా పట్టించుకోమని స్టార్స్ బయటికి చెబుతుంటారు. కానీ లోన మాత్రం కుర్చీలాటలో ముందు వరుసలో నిలవాలని నంబర్ గేమ్ లో మనదే పైచేయి గా వుండాలని చూస్తుంటారు. అందుకు తగిన ప్రాజెక్ట్ లని ఎంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం మల్లువుడ్ లోనూ కుర్చీలాట జోరుగా సాగుతోంది.పాండమిక్ టైమ్ లో మళయాల స్టార్లు ఇతర భాషల్లోనూ ఓటీటీల ద్వారా తమ సత్తాని చాటుకుంటూ వచ్చారు. తమ ఇండస్ట్రీలో సక్సెస్ లని సొంతం చేసుకుంటూనే ఇతర భాషల్లో తమ సినిమాలతో ఓటీటీలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సొంత ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల్లోనూ సత్తాను చాటుతున్న మలయాళ స్టార్ లలో పృథ్వీరాజ్ సుకుమారన్ దుల్కర్ సల్మాన్ ఫహద్ ఫాజిల్ రేసులో ముందు వరుసలో వున్నారు. ఈ ముగ్గురిలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నిర్మాతగా దర్శకుడిగానూ త్రిపాత్రాభినం చేస్తూ మాంచి జోరుని ప్రదర్శిస్తున్నాడు.

అయితే దుల్కర్ ఫహద్ మాత్రం పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటూ తరువాత స్థానల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరూ మలయాళ చిత్రాలతో పాటు తెలుగు తమిళ సినిమాల్లోనూ నటిస్తూ తమ సత్తాని చాటుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'సీతా రామం' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈమూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఫహద్ ఫాజిల్ కూడా దుల్కర్ తరహాలోనే మలయాళ చిత్రాలతో పాటు తమిళ తెలుగు భాషల్లోనూ క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఫహద్ తెలుగులో నటించిన క్రేజీ మూవీ 'పుష్ప' గత ఏడాది విడుదలై పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించింది. త్వరలో పార్ట్ 2 కూడా సెట్స్ పైకి రాబోతోంది. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో ఫహద్ పాత్ర నిడివి ప్రియారిటీ ఎక్కువ. ఇక ఇటీవల కమల్ నటించిన 'విక్రమ్'లోనూ ఫహద్ కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. వార్తల్లో నిలిచాడు.

వీరిద్దరి తీరు ఇలా వుంటే వీరిని మించి పృథ్వీరాజ్ తెలుగులోనూ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తను నటించిన 'జనగణమన' ఇటీవలే తెలుగులోనూ విడుదలైంది. మరో మూవీ 'కడువా' రిలీజ్ కి రెడీ గా వుంది. అంతే కాకుండా ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ 'సలార్'లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు కూడా. మల్లువుడ్ లో నవీన్ పాలి వంటి క్రేజీ హీరోలు వున్నా ప్రస్తుతం రేసులో వెనకబడటంతో ఈ ముగ్గరిదే హవా నడుస్తోంది.

ఈ ముగ్గురిలో ఒక్కరు మల్లువుడ్ టాప్ హీరోగా స్టార్ డమ్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కుర్చీలాటలో హీరోగా నిర్మాతగా డైరెక్టర్ గా అదరగొడుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నిలుస్తాడో లేక యూత్ ని ఆకట్టుకుంటున్న దుల్కర్ విభిన్నమైన సినిమాలతో సాగుతున్న ఫహద్ నిలుస్తాడో మరి కొన్ని రోజుల్లోనే తేలనుందని చెబుతున్నారు.