ఓ బ్లాక్ బస్టర్.. ఓ భారీ డిజాస్టర్.. నెక్స్ట్ ఏంటి..??

Fri Dec 03 2021 08:00:02 GMT+0530 (IST)

One Blockbuster One Huge Disaster What Next

''ఉప్పెన'' సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని డెబ్యూ హీరోగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాడు. ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయిన వైష్ణవ్ కు.. బడా బ్యానర్ల నుంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వైష్ణవ్ తేజ్ కు రెండో చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ హీరోగా నటించిన ''కొండపొలం'' సినిమా దసరాకు ముందు వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉప్పెన' బాక్సాఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో.. మెగా మేనల్లుడి సెకండ్ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. క్రిష్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ - స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

ఈ నేపథ్యంలో థియేటర్లలోకి వచ్చిన 'కొండపొలం' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండస్ట్రీకి ఊపు తీసుకొస్తుందని అనుకున్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో మెగా హీరో ఒకే ఏడాదిలో ఒక బ్లాక్ బస్టర్ తో పాటుగా భారీ ప్లాప్ ని తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమాపై అందరి దృష్టి పడింది.

'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేతిక శర్మ ఇందులో హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదే క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ ఓ సినిమా చేయనున్నాడు. ఓ డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించే ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.