మూవీ రివ్యూ: ‘ఒక్క క్షణం’

Thu Dec 28 2017 17:15:51 GMT+0530 (IST)

Okka Kshanam Review

చిత్రం : ‘ఒక్క క్షణం’నటీనటులు: అల్లు శిరీష్ - సురభి - అవసరాల శ్రీనివాస్ - సీరత్ కపూర్ - దాసరి అరుణ్ కుమార్ - జయప్రకాష్ - కాశీ విశ్వనాథ్ - రోహిణి - సత్య-ప్రవీణ్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: చక్రి చిగురుపాటి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వీఐ ఆనంద్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు యువ దర్శకుడు వీఐ ఆనంద్. ఇప్పుడతను ‘ఒక్క క్షణం’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. ఆసక్తికర టీజర్.. ట్రైలర్లతో ఆకట్టుకుంది. ఆనంద్ మరో విభిన్న కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

జీవా (అల్లు శిరీష్) చదువు పూర్తి చేసి ఖాళీగా ఉన్న కుర్రాడు. జ్యో (సురభి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడికి ఆకర్షితురాలవుతుంది. ఇద్దరూ ఒక్కటయ్యే సమయానికి శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్)-స్వాతి (సీరత్ కపూర్) అనే ఇద్దరు వ్యక్తుల గురించి వీళ్లకు తెలుస్తుంది. జీవా-జ్యో పరిచయం.. వారి ప్రేమ.. ఇతర విషయాలన్నీ కూడా సరిగ్గా శ్రీనివాస్-స్వాతిల జీవితంలో జరిగినట్లే జరుగుతున్నట్లు తెలిసి షాకవుతారు. అదే సమయంలో స్వాతి చనిపోతుంది. ఆమెను శ్రీనివాసే హత్య చేసినట్లు వెల్లడవుతుంది. దీంతో స్వాతి కూడా జీవా చేతిలో తాను హత్య చేయబడతానేమో అని భయపడుతుంది. ఇంతకీ ఈ రెండు జంటల జీవితాలు ఒకేలా ఉండటానికి కారణమేంటి.. నిజంగా స్వాతిని జీవా చంపేస్తాడా? చివరికి వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అన్న ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో ఒక కొత్త కథను చెప్పడమే కాదు.. ప్రేక్షకుడికి ఊపిరి సలపనివ్వని మలుపులతో ఉత్కంఠ రేకెత్తించాడు దర్శకుడు ఆనంద్. ‘ఒక్క క్షణం’లో కూడా అతను చెప్పిన కథ కొత్తది. ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ కచ్చితంగా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ మాత్రమే కాదు.. దాన్ని దాటి ఆసక్తికర మలుపులతో కథను తీర్చిదిద్దాడు ఆనంద్. ఇక్కడి వరకు ఓకే కానీ.. ఎంతో విషయం ఉన్న ఈ కథను ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో.. ఉత్కంఠ రేకెత్తించేలా చెప్పలేకపోయాడు ఆనంద్. కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తున్నా.. మలుపులూ బాగున్నా.. ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ మాత్రం ఆద్యంతం వెంటాడుతూనే ఉంటుంది ‘ఒక్క క్షణం’లో.

ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని ప్రేమకథతో సినిమాను మొదలుపెట్టడం ‘ఒక్క క్షణం’కు పెద్ద ప్రతికూలత. ముందు ఏవో సాదాసీదా సన్నివేశాలతో నడిపించేసి.. ఇంటర్వెల్ దగ్గర అసలు కథను మొదలుపెట్టే చాలామంది దర్శకుల్నే ఆనంద్ ఫాలో అయ్యాడు. తొలి ముప్పావు గంటా ప్రేక్షకుల ఆసక్తిని నీరు గార్చేస్తుంది. ఇందులోని ప్రేమకథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక దర్శకుడు అసలు కథను ఎప్పుడు మొదలుపెడతాడన్న దాని మీదే ప్రేక్షకుల దృష్టి నిలిచి ఉంటుంది. ప్యారలల్ లైఫ్ కాన్సెప్టుని త్వరగానే పరిచయం చేసినప్పటికీ తొలి ముప్పావు గంటలో దాన్ని సీరియస్ గా తీసుకునేలా సన్నివేశాలు ఉండవు. అవసరాల-సీరత్ కపూర్ ఎపిసోడ్ కూడా ఏమంత ఆసక్తి రేకెత్తించదు. ఐతే ఇంటర్వెల్ ముంగిట కథ మలుపు తిరగడంతో ప్రేక్షకులు అక్కడి నుంచి సీరియస్ గా సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు.

ద్వితీయార్దంలో ఆనంద్ చాలా విషయాలే చూపించాడు. కథను అనేక రకాల మలుపులు తిప్పాడు. ప్రేక్షకులకు చాలా సర్ప్రైజులే ఉంటాయి ఇక్కడ. ఒక దశ దాటాక ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ నుంచి కథ పక్కకు వెళ్లిపోతుంది. మర్డర్ మిస్టరీ మీద నడిచే థ్రిల్లర్ రూపంలోకి మారుతుంది. ఇక్కడ వచ్చే మలుపులు ఆసక్తికరమే కానీ.. సన్నివేశాల్లో ఇంటెన్సిటీ మాత్రం లేకపోయింది. దర్శకుడు టెన్షన్ బిల్డ్ చేయలేకపోయాడు. మరింత బిగితో సన్నివేశాల్ని తీర్చిదిద్దుకోవాల్సిందనిపిస్తుంది. కథ మలుపులు తిరుగుతున్నా.. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం లేకపోయింది.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తనపై ఆనంద్ అంచనాలు భారీగా పెంచేసిన నేపథ్యంలో ‘ఒక్క క్షణం’ను దాంతో పోల్చుకోకుండా ఉండలేం. అందులో లాగా ఇందులో వినోదం లేకపోవడం.. ఆ స్థాయిలో ఉత్కంఠ రేకెత్తించకపోవడం ప్రతికూలతలుగా కనిపిస్తాయి. సత్య.. ప్రవీణ్ లాంటి వాళ్లు ఉన్నా కానీ.. ఎక్కడా ఎంటర్టైన్మెంట్ కు ఛాన్సే లేకపోయింది. రొమాంటిక్ ట్రాక్ కూడా తేలిపోవడంతో కేవలం కథలోని కొత్తదనం మీద.. మలుపుల మీదే సినిమా నడవాల్సిన పరిస్థితి  నెలకొంది. సినిమాకు బలం అవే. కొత్తదనం కోరుకునే.. థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ‘ఒక్క క్షణం’ ఓకే అనిపిస్తుంది. ఐతే ‘ఒక్క క్షణం’ మరింత మెరుగ్గా తయారవడానికి అవకాశముండి కూడా.. ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగలేదన్న భావన కలిగిస్తుంది.

నటీనటులు:

అల్లు శిరీష్ ఓకే అనిపిస్తాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ తరహాలోనే తన పాత్రను క్యాజువల్ గా చేసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అతడికి నటుడిగా పరీక్ష పెట్టే సన్నివేశాలేమీ లేవు ఇందులో. హీరోయిన్ సురభి అందంగా ఉంది. నటన పర్వాలేదు. అవసరాల శ్రీనివాస్ పాత్ర తేలిపోయింది. అతడి పాత్ర నుంచి ఏదో ఆశిస్తాం కానీ.. అలాంటిదేమీ ఉండదు. అతడి టాలెంటుని దర్శకుడు ఉపయోగించుకోలేదు. ఆ పాత్రను మధ్యలో వదిలేశాడు. సీరత్ కపూర్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఆమె ఏ రకంగానూ ఆకట్టుకోదు. ఆమె లుక్స్ పేలవంగా అనిపిస్తాయి. కొత్తగా విలన్ అవతారం ఎత్తిన దాసరి అరుణ్ కుమార్.. మామూలుగా అనిపిస్తాడు. ఈ పాత్ర కానీ.. అతడి నటన కానీ ప్రత్యేకంగా అనిపించవు. తమిళ నటుడు జయప్రకాష్ ది చిన్న పాత్ర. రోహిణి.. సత్య.. ప్రవీణ్ తమ వంతుగా బాగానే చేశారు.

సాంకేతికవర్గం:

మణిశర్మ పాటలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాల్లో మణిశర్మ పనితనం కనిపిస్తుంది. శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. అబ్బూరి రవి మాటలు పర్వాలేదు. ఇక దర్శకుడు వీఐ ఆనంద్ మరోసారి కొత్త కథతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు. కథ మీద ఆనంద్ చేసిన కసరత్తు మాత్రం ప్రశంసనీయమే. స్క్రీన్ ప్లే భిన్నంగానే చేసుకున్నాడు కానీ.. మరింత బిగితో ఉండాల్సింది. ప్రథమార్ధాన్ని అతను ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉంటే ‘ఒక్క క్షణం’ కూడా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరహాలోనే ప్రత్యేకమైన సినిమా అయ్యేది. ఓవరాల్ గా ఆనంద్ ఓకే అనిపిస్తాడు కానీ.. గత సినిమా తర్వాత అతడి మీద పెట్టుకున్న అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయాడు.

చివరగా: ఒక్క క్షణం.. ఒక సగం బోరింగ్.. ఇంకో సగం థ్రిల్లింగ్!

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre