'కండిషన్స్ అప్లై' అంటున్న ఓటీటీలు...?

Wed Jul 08 2020 20:07:54 GMT+0530 (IST)

OTTs That 'Conditions Apply' ...?

దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత నాలుగు నెలలుగా మల్టీప్లెక్సెస్ థియేటర్లు మూసి వేశారు. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇక థియేటర్స్ రీ ఓపెన్ చేసి.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి వస్తారా అనేదీ అనుమానమే. ఈ నేపథ్యంలో డిసెంబర్ వరకు కచ్చితంగా థియేటర్స్ తెరిచే పరిస్థితి లేదని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రచ్చ చేయడం స్టార్ట్ చేసాయి. సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన సిచ్యుయేషన్ ని క్యాష్ చేసుకోవాలని భావించిన ఓటీటీలు ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమాలను కొని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే డజనుకు పైగా సినిమాలు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.. మరో డజను సినిమాలు ఓటీటీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.అయితే ఇప్పుడు రిలీజ్ ఆగిపోయిన చాలా చిన్న సినిమాలు ఓటీటీల వైపు చూస్తుండటంతో ఓటీటీ వారు దీనిని అవకాశంగా తీసుకొని ప్రొడ్యూసర్స్ తో డీల్స్ విషయంలో కండిషన్స్ పెడుతున్నారట. ఓటీటీలో విడుదల చేయబోయే సినిమాల ప్రొడ్యూసర్స్ కి డబ్బులు ఒకేసారి చెల్లించకుండా రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ఇస్తామని చెబుతున్నారట. దానికి కూడా మరికొన్ని కండిషన్లు జత చేస్తున్నారట. పరిమిత కాలం పూర్తయిన తర్వాతే రెవెన్యూలో షేర్ ఇచ్చే రీతిన షరతులు పెడుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఒక్కో గంటకి 75 పైసలు నుంచి 9 రూపాయల వరకు మాత్రమే ఇచ్చే విధంగా ఓటీటీలు తమ రూల్స్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే నష్టాల నుండి బయటపడొచ్చని తమ సినిమాలని ఓటీటీలో విడుదల చేస్తున్న నిర్మాతలకి ఒరిగేది ఏమీ ఉండదని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స్ కి డబ్బులు తెచ్చిన నిర్మాతలకి ఓటీటీలు పెట్టే ఈ కండిషన్స్ ఉపశమనాన్ని కలిగించలేవని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఓటీటీలు ఎలాంటి షరతులు పెట్టబోతున్నారో చూడాలి.