Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాకూ ఓటీటీ రిలీజ్?

By:  Tupaki Desk   |   27 May 2020 6:30 AM GMT
మహేష్ సినిమాకూ ఓటీటీ రిలీజ్?
X
గత రెండు నెలలుగా సినిమా థియేటర్లు మూసి ఉండడంతో చాలా సినిమాల రిలీజులు ఆగిపోయాయి. చిన్న సినిమాల వారు కొందరు ఓటీటీ రిలీజ్ కు జై కొడుతున్నారు కానీ మీడియం రేంజ్.. పెద్ద సినిమాల వారు మాత్రం ఓటీటీ రిలీజుకు ససేమిరా అంటున్నారు. ప్రస్తుతానికి తెలుగులో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ఓటీటీ బాట పట్టబోతుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాను 'రిషి' అనే టైటిల్ తో డబ్బింగ్ చేసి తమిళంలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుకోకుండా థియేటర్లు మూతపడడంతో రిలీజ్ ప్లానింగ్ అటూ ఇటూ అయిపోయింది. అయితే ఈ సినిమా తమిళ రైట్స్ కొనుగోలు చేసిన నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ పక్కనబెట్టి ఏదైనా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనో లేకపోతే యూట్యూబ్ సెగ్మెంట్ లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట.

ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు కొందరు ఆ తమిళ వెర్షన్ నిర్మాతలపై మండిపడుతున్నారు. ఇది మహేష్ సత్తాను అవమానించడమేనని తమిళంలో కూడా థియేట్రికల్ రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విజయ్ సినిమానో సూర్య సినిమానో అయితే తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. కారణాలు ఏవైనా కానివ్వండి.. మహమ్మారి దెబ్బకు సూపర్ స్టార్ సినిమా కూడా ఓటీటీ బాట పడుతుండడం మాత్రం ఆశ్చర్యకరమే.