గోపిచంద్ సినిమాకు ఓటీటి కష్టాలు

Sun May 09 2021 17:00:01 GMT+0530 (IST)

OTT difficulties for Gopichand film

పెద్ద హీరోల సినిమాలకు సాధారణంగా ఓటీటి కష్టాలనేవి ఉండవు. కాస్త రేట్లు దగ్గర బేరసారాలు ఉంటాయంతే. కాని కొన్ని సినిమాలు ఎంత మంచి స్టార్ కాస్టింగ్ ఉన్నా ముందుకు వెళ్లవు. రకరకాల కారణాలు వెనక్కి లాగేస్తూంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 'ఆరడుగుల బుల్లెట్'.   నాలుగేళ్ల క్రితం గోపీచంద్ నయనతార జంటగా సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాఅప్పట్లో విడుదల చేయాలని చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదు. ఈ సినిమా రైట్స్ ని అప్పట్లో  నిర్మాత పివిపి 9 కోట్లకు   కొనాలని చూసినా కూడా కుదరలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్‌లోకి దిగలేక ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఓటీటి మార్కెట్ పుంజుకోవటంతో ఎంతో కొంత కు రేటు ఫిక్స్ చేసుకుని ఓటీటికు ఇచ్చేద్దామని నిర్మాతలు నిర్ణయంచుకున్నారట. అదీ జరగటం లేదు.
 
గత కొంతకాలంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత తాండ్ర రమేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గోపీచంద్ వంటి యాక్షన్ హీరో.. నయనతార లాంటి సూపర్ స్టార్ ఉండటంతో కచ్చితంగా 'ఆరడుగుల బుల్లెట్'కు మంచి రేటు వస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే పరిస్దితులు అంతకు తగ్గట్లు లేవు.ఆ మధ్యన ఓ ప్రముఖ ఓటిటి సంస్థ దీనికి 15 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే నాలుగేళ్ల వడ్డీలు కలిపి ఈ సినిమాకు 18 కోట్లక పైగానే బడ్జెట్ దాటిందని ఆ మొత్తం ఇమ్మని అడిగారట. అయితే గోపిచంద్ కు మార్కెట్ లేకపోవటంతో అంత మొత్తం రావడం కష్టమే అని తేల్చి చెప్పారట. సరే అని ముందుకు వెళ్దామన్నా ఓ ట్విస్ట్ పడిందిట. గతంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ వాళ్లకు ఈ సినిమాను 8 కోట్లకు శాటిలైట్ డిజిటల్ రైట్స్ అమ్మినట్లు సమాచారం. దాంతో వాళ్ల దగ్గర సెటిల్మెంట్ చేసుకుని డిజిటల్ రైట్స్ తీసుకోవాలి. కానీ బయిట మంచి రేటు పలుకుతున్నప్పుడు  ఎందుకు ఒప్పుకుంటారు అనేది ప్రశ్న. ఇలా ఆరుడగుల బుల్లెట్ ఎంత ప్రయత్నం చేసినా ఓటీటి వైపు కూడా కదలటం లేదు.