Begin typing your search above and press return to search.

'ఓటీటీలు 5 పాటలు.. ఫైట్స్ అనే సినిమా ఫార్ములాను మార్చేశాయి'

By:  Tupaki Desk   |   24 Jun 2021 3:30 AM GMT
ఓటీటీలు 5 పాటలు.. ఫైట్స్ అనే సినిమా ఫార్ములాను మార్చేశాయి
X
డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒకప్పుడు థియేటర్లలోనే సినిమాలు చూసి ఆనందించే ప్రేక్షకులు.. ఇప్పుడు తనకు నచ్చిన కంటెంట్ ను వీలైన ప్రదేశంలో చూసే అవకాశం ఓటీటీలు కల్పిస్తున్నాయి. థియేటర్ ఎక్సపీరియన్స్ ఇవ్వనప్పటికీ.. ఆడియన్స్ కు కొత్త కథలని అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త నటీనటులు.. టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెబుతోంది. మంగళవారం యుఎస్‌ లో జీ 5 ఓటీటీ ప్రారంభించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో ప్రియాంకా చోప్రా జోనాస్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు డిఫరెంట్ స్టోరీలను యాక్సెప్ట్ చేసినట్లే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని కూడా స్వీకరించాలని అన్నారు.

''స్ట్రీమింగ్ వేదికలు ఇప్పుడు ఇండియాలో చాలా మందిలో ఉన్న టాలెంట్ బయటకు తీసేందుక ఉపయోగపడుతున్నాయి. సాదారణంగా 5 పాటలు.. యాక్షన్ సీన్స్ ఉండాలి అనేది బాలీవుడ్ సినిమా ఫార్ములా. కానీ ఇప్పుడు అది లేదు. గొప్ప కథలు.. నిజమైన కథలను చెప్పే సమయం వచ్చిందని ప్రేక్షకులు గుర్తించారు'' అని ప్రియాంక చోప్రా అన్నారు. 'ఇండియాలో స్ట్రీమింగ్ సేవలు నటీనటులను సినీ పరిశ్రమలో నిబంధనల గురించి ఆలోచించేలా చేశాయి. బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేసింది. ఫలితంగా కొత్త కథలు వస్తున్నాయి. కొత్త రచయితలు, నటీనటులు, దర్శకనిర్మాతలకు సినీ పరిశ్రమలోకి రావడానికి ఓటీటీలు అవకాశం కల్పిస్తున్నాయి'' అని ప్రియాంక చెప్పారు.

''అయితే థియేటర్ అనుభవంతో దేనినీ పోల్చలేము. కానీ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు విశేషమైన కంఫర్ట్ అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు స్ట్రీమింగ్ అందించిన స్వేచ్ఛ ఏమిటంటే.. ఇళ్లలో కూర్చొని మనకు నచ్చిన కంటెంట్ చూడొచ్చు. ఇది సంస్కృతి విస్తరించడాని ఉపయోగపడుతుంది'' అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం జిమ్ స్ట్రౌస్ దర్శకత్వంలో 'టెక్ట్స్‌ ఫర్‌ యూ' అనే హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తోంది. అలానే 'సంగీత్ ప్రాజెక్ట్' అనే వెబ్ సిరీస్ చేస్తోంది.