Begin typing your search above and press return to search.

ఫ్రెష్ కంటెంట్ ను అందిస్తోంది సరే.. ఆశించిన ఆదరణ దక్కుతోందా..?

By:  Tupaki Desk   |   28 Jun 2022 8:30 AM GMT
ఫ్రెష్ కంటెంట్ ను అందిస్తోంది సరే.. ఆశించిన ఆదరణ దక్కుతోందా..?
X
పాండమిక్ పుణ్యమా అని డిజిటల్ రంగంలో ఓటీటీలు బాగా అభివృద్ధి చెందాయి. థియేటర్లలో బిగ్ స్క్రీన్ పై సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్స్ కంటెంట్ కు అలవాటు పడటంతో డిజిటల్ వేదికలు పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీల మధ్య పోటీ ఎక్కువైంది.

ప్రస్తుతం ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి అనేక ఓటీటీలు ఏటీటీలు అందుబాటులో ఉన్నాయి. వీక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందించడానికి కృషి చేస్తున్నాయి. ఈ విధంగా సబ్ స్క్రైబర్స్ పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను అందించడమే లక్ష్యంగా ఓటీటీ రంగంలో అడుగుపెట్టింది స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ZEE5. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్పురి, గుజరాతీ, పంజాబీ వంటి 12 భారతీయ భాషల్లో కంటెంట్ ను అందిస్తోంది.

ముఖ్యంగా తెలుగు కంటెంట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది జీ5. డైరెక్ట్ ఓటీటీ రిలీజులు - ఆసక్తికరమైన వెబ్ సిరీసులు - బ్లాక్ బస్టర్ సినిమాలు మరియు డబ్బింగ్ కంటెంట్ తో వీక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తోంది. వందకు పైగా క్లస్టర్‌లలో ఒరిజినల్ కంటెంట్ మరియు విభిన్నమైన కంటెంట్‌ కు ప్రతిధ్వనించే కథాంశాలపై దృష్టి సారించింది.

అయితే జీ5 తెలుగులో కావాల్సినంత స్టఫ్ ఇస్తోంది కానీ.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జీ5 ఓటీటీ లైబ్రరీలో ఇప్పటి వరకు 3500కి పైగా చిత్రాలు - 1750 టీవీ ప్రోగ్రామ్స్ - 700 ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇటీవల 'ఆర్.ఆర్.ఆర్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించిన నాలుగు దక్షిణాది భాషల వెర్సన్స్ ను స్ట్రీమింగ్ చేసింది. అయితే నెట్ ఫ్లిక్స్ లో ట్రిపుల్ ఆర్ హిందీ వెర్షన్ కు దక్కుతున్న ఆదరణతో పోలిస్తే.. జీ5 ఓటీటీకి తక్కువ రెస్పాన్స్ వచ్చినట్లే తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ప్రాంతీయ మార్కెట్లలో మరింత మందికి చేరువ అవడానికి.. వీక్షకులకు నాణ్యమైన కంటెంట్ ను అందించడానికి.. బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా ఇంట్రెస్టింగ్ ఒరిజినల్స్ తో రావడానికి జీ5 సమాయత్తం అవుతోందని తెలుస్తోంది.

ఇప్పటికే 'కార్తికేయ-2' మరియు 'హను-మాన్' వంటి పాన్ ఇండియా చిత్రాల హక్కులను కొనుగోలు చేసింది. అలానే 11 సరికొత్త వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతోంది. మరి వీటి తర్వాత ZEE5 ఓటీటీ తెలుగు కంటెంట్ విషయంలో టాప్ లో నిలుస్తుందేమో చూడాలి.