కంటెంట్ పై దృష్టి సారించకపోతే ఓటీటీలతో చిక్కే

Fri May 14 2021 08:00:01 GMT+0530 (IST)

OTT Punch for movies without content

థియేటర్లు మూత పడటంతో సినీ ప్రియులంతా ఓటీటీలపైనే పడ్డారు. మొబైల్ టీవీల్లో సినిమా వీక్షణను అలవాటు పడ్డారు. ఈ పరిణామం మునుముందు థియేట్రికల్ రంగంపై బిగ్ పంచ్ వేయనుందా? అంటే ఒక సెక్షన్ అవుననే విశ్లేషిస్తోంది.ఇంకో రెండు మూడు నెలల పాటు సెకండ్ వేవ్ ప్రభావం ఇలానే ఉంటే.. లాక్ డౌన్ ఆంక్షలు పెరిగే ఛాన్సుంది. అప్పుడు అందరికీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒక్కటే కీలకంగా మారినట్టు. భవిష్యత్ లో మరింత కీలకంగా మారడానికి ఛాన్స్ ఉంది. అమెజాన్ ప్రైమ్- నెట్ ప్లిక్స్- ఎమ్ ఎక్స్ ప్లేయర్- జీ 5 లాంటి సంస్థలు అగ్రగామి  ఓటీటీ సంస్థలుగా కొనసాగుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఓటీటీలు  కోట్ల రూపాయలు  ప్రోడక్ట్  కోసం ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటివరకూ చాలా తెలుగు సినిమాలు పలు ఓటీటీ వేదికలపై ప్రదర్శింపబడ్డాయి. లో బడ్జెట్ సహా మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీ ల్లోకి వచ్చేస్తున్నాయి.

అయితే ఇక్కడే తెలుగు సినిమా ఓటీటీలో కిల్ అవుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీలో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. కానీ పేలవమైన కంటెంట్ సినిమాలు మాత్రం ఓటీటీ రేసులో ఎంత మాత్రం నిలబడడం లేదు. ఆ ప్రభావం మిగతా తెలుగు సినిమాలపైనా పడుతుందని అంటున్నారు. అన్ని భాషల చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తున్నా ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్న కంటెంట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగు సినిమా అనే విమర్శ గట్టిగానే వినిపిస్తోంది. తద్వారా హిట్టైన సినిమాలపై ఆ ప్రభావం పడటంతో పాటు.. ఇతర  భాషల సినిమాలకు పోటీగా నిలబడలేకపోతున్నాయన్నది కొందరి వాదన.

ఈ నెగెటివ్ టాక్ వల్ల తెలుగు సినిమాకు గడ్డు కాలం తప్పదనే నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ  భాషల సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువ కాన్సెప్ట్ బేస్ట్  స్క్రిప్ట్ లతో ఆకట్టుకుంటున్నాయి. కానీ తెలుగు సినిమా ఆ పంథాకు దూరంగా ఉండటం ఇబ్బందికరంగా మారుతుందని ఓటీటీ నిర్వాహకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎక్కువగా లో- బడ్జెట్ సినిమాలు నాశిరకంగా తెరకెక్కుతున్నాయన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరంగాను పర భాషా సినిమాలకు ఉన్న డిమాండ్ మన లోబడ్జెట్ సినిమాలకు లేదని అంటున్నారు. ఈ విమర్శల్ని బట్టి కనీసం కొత్తగా పరిమిత బడ్జెట్ సినిమాలు తీసేవాళ్లు కంటెంట్ పై మరింత దృష్టి సారిస్తే మంచిదని చెబుతున్నారు. ఓటీటీల్లో థ్రిల్లర్లు క్రైమ్ హారర్ జోనర్లకు ఆదరణ బావుంది. కంటెంట్ బేస్డ్ గా మాత్రమే ఈ వేదిక రన్ అవుతోంది.