'O 2' టీజర్: ఊబిలో కూరుకుపోయిన బస్సులో నయన్ కు ఆక్సిజన్ ఎలా?

Mon May 16 2022 12:16:41 GMT+0530 (IST)

O2 Official Teaser Nayanthara

లేడీ సూపర్ స్టార్ నయనతార సుధీర్ఘ కాలంగా దక్షిణాది టాప్ హీరోయిన్లలో ‏ఒకరిగా కొనసాగుతోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలు మరియు మహిళా ప్రాధాన్యత సినిమాలతో ప్రేక్షకులకు అలరిస్తూ వస్తోంది. ఇటీవల 'కణ్మణి రాంబో ఖతీజా' అనే చిత్రంతో పలకరించిన నయన్.. ''O 2'' అనే ఆసక్తికరమైన సినిమాతో వస్తోంది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ''O2''. GS విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ + హాట్ స్టార్ లో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఇటీవల వచ్చిన 'O2' ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ప్రమాదవశాత్తు ఓ బస్సు భూమి కింద కొన్ని మీటర్ల మేర ఊబిలో ఇరుక్కుపోయినట్లు టీజర్ లో చూపుతున్నారు. సహాయం కోసం ప్రయత్నిస్తున్న బస్సులోని ప్రయాణికులకు.. సమయం గడిచే కొద్దీ ఆక్సిజన్ అందడం లేదు.

అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే అందరూ ప్రశాంతంగా ఓపికగా ఉంటే 12 గంటలు జీవించగలరని.. ఆ సమయంలోగా వీలైతే సహాయం పొందవచ్చని ప్రయాణీకుల్లో ఒకరైన నయనతార అర్థం చేసుకుంది. అక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఆ బస్సు ని అధికారులు కనుగొన్నారా లేదా? ప్రయాణీకులు సురక్షితంగా బయట పడ్డారా లేదా? అనేది తెలియాలంటే ''O 2'' సినిమా చూడాల్సిందే. సినిమా నేపథ్యం అంతా ప్రాణవాయువు చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. ఈ చిత్రానికి అలాంటి టైటిల్ పెట్టారని తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాకు ముందుగా 'ఆక్సిజన్' అనే టైటిల్ ను పెట్టారు. ఆ తర్వాత దాని రసాయనిక నామం 'O 2' ను టైటిల్ గా ఫిక్స్ చేశారు. టీజర్ ని బట్టి ఈ సినిమా నయన్ ఇంతకుముందు నటించిన 'కర్తవ్యం' మాదిరిగా అనిపిస్తుంది.

కాకపోతే అక్కడ బోరు బావిలో పడిన ఒక చిన్న పాపని కాపాడగా.. ఇక్కడ మాత్రం ఏకంగా ఒక బస్సు అదృశ్యమవడం ఆసక్తికరం. 'నేత్రికణ్' సినిమా తర్వాత తర్వాత డిస్నీ+హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతోన్న నయనతార రెండో సినిమా ''ఓ2''.

SR ప్రభు - SR ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. 'O 2' టీజర్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తమిజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. సెల్వ ఆర్కే ఎడిటింగ్ వర్క్ చేశారు.

''O2'' చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ లో తెలుగు తమిళం మలయాళం కన్నడ వంటి పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక నయనతార విషయానికొస్తే.. 'గోల్డ్' - 'లయన్' - 'కనెక్ట్' - 'పఠాన్' మరియు 'గాడ్ ఫాదర్' వంటి మలయాళం హిందీ మరియు తెలుగు చిత్రాలలో నటిస్తోంది.