మీటూ స్ఫూర్తిని మంట కలిపిన ఖాన్?

Wed Sep 11 2019 13:22:46 GMT+0530 (IST)

No compassion for me, Aamir Khan? Says Tanushree Dutta

2018 ఆద్యంతం మీటూ(#MeToo ) ఉద్యమం హీటెక్కించిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు నానా పటేకర్ ని బాలీవుడ్ దుర్యోధనుడిగా చిత్రీకరిస్తూ తనూశ్రీ దత్తా తనపై జరిగిన దాష్ఠీకాన్ని మీటూ వేదికగా ఆరోపించడంతో అసలు కథ మొదలైంది. ఆన్ లొకేషన్ తనని నానా పటేకర్ లైంగికంగా వేధించారని.. నానా దుర్భాషలు ఆడారని.. తీవ్రంగా కొట్టారని తనూశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. అనంతరం దానిపై పోలీస్ విచారణ సాగింది. కోర్టుల పరిధిలో వాయిదాలు నడిచాయి. అటుపైనా వరుస ఆరోపణలతో పోలీసులు- కోర్టులు- గొడవలు అంటూ ఇండస్ట్రీ అట్టుడికిపోయింది. పలువురు నటులు.. దర్శకులను మాన్ స్టర్లు అంటూ ఆరోపిస్తూ నటీమణులు ఆన్ లైన్ వేదికలపై పోరాటం సాగించారు. అయితే ఇవేవీ కోర్టుల పరిధిలో పరిష్కారం కాలేదు సరి కదా వీళ్లపై ఆరోపణలకు సరైన ఆధారాల్లేవంటూ కోర్టులు కొట్టి పారేయడంతో బాధితురాళ్లంతా గొల్లుమన్నారు. కోర్టులోనూ తమకు న్యాయం జరగలేదని వాపోయారు. అందులో ముఖ్యంగా తనూశ్రీ దత్తా పేరు ప్రముఖంగా వినిపించింది. అదంతా గతం అనుకుంటే వర్తమానంలో మరోసారి మీటూ గురించిన ప్రస్థావన .. తనూశ్రీ దత్తా గురించి ప్రస్థావన వేడెక్కిస్తోంది. నిన్న గాక మొన్న మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ .. అప్పటివరకూ హోల్డ్ లో పెట్టిన టీసిరీస్ గుల్షన్ కుమార్ బయోపిక్ ని తిరిగి తెరపైకి తెస్తూ ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. మీటూ ఆరోపణల వల్ల అతడితో పని చేయడం లేదని ప్రకటించిన అమీర్ ఖాన్ ఆర్నెళ్లలోనే మాట మార్చడంపై తాజాగా తనూశ్రీ దత్తా ఫిరంగులు పేల్చింది. అమీర్ వ్యవహారాన్ని ఒక రకంగా తూర్పారబట్టింది.

దర్శకుడు సుభాష్ చేసిన నేరం నిజం అని నిరూపణ అయ్యే వరకూ ఏ నిర్ణయం తీసుకోవడం సరికాదని.. గిల్టీ ఫీలవుతున్నానని అమీర్ అన్నారు. ప్రూవ్ కాకుండానే తనని పక్కన పెట్టడం సరికాదనిపించిందని.. తనకు నిద్ర లేని రాత్రులు ఎదురయ్యాయని అమీర్ ఖాన్ అనడాన్ని తనూశ్రీ తప్పు పట్టింది. మిస్టర్ పెర్ఫెక్ట్ తాజా నిర్ణయంపై సెటైర్లు వేసింది. అమెరికా నుంచి ముంబైలో అడుగు పెట్టిన తనూశ్రీ.. ఈ విషయం తెలిసి షాక్ కి గురైందట. మీటూ వేదికగా వేధింపులు ఎదుర్కొన్న దర్శకుడితో అమీర్ పని చేయడమేమిటని ప్రశ్నించింది. దశాబ్ధాల పాటు అబలలు సెక్సువల్ గా వేధింపులకు గురవుతుంటే అప్పుడు నిద్ర పట్టిందా?  నాడు ఎదురుకాని సన్నివేశం పాపం ఆ దర్శకుడి విషయంలో ఎదురైందా? అంటూ సెటైర్లు వేసింది. ఒక అమ్మాయి వేధింపులకు గురయ్యానని ఆరోపించినప్పుడు బాలీవుడ్ జనాలకు నిద్ర పట్టకపోవడం అనేది ఉందా?  అమీర్ నిర్ణయాన్ని బట్టి ఇండస్ట్రీ డబుల్ స్టాండార్డ్స్ అర్థమవుతున్నాయి. అయినా సుభాష్ ని అమీర్ అవకాశం ఇస్తే.. తనవల్ల ఆవేదనకు గురైన గీతిక త్యాగి కనిపించలేదా తనకు? నటిగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటే అతడికి కనిపించడం లేదా?  అవకాశాల్లో అమ్మాయిలకు సమానమైన హక్కు  లేదా? అంటూ ప్రశ్నలతోనే తనూశ్రీ ఉక్కిరి బిక్కిరి చేసింది. మీటూ ఉద్యమ స్ఫూర్తిని అమీర్ ఖాన్ మంట కలిపాడని తనూశ్రీ ఆరోపించింది. వేధింపులు అన్నవే లేని పరిశ్రమలో పని చేయడం అన్నది అమ్మాయిలకు ఎప్పటికీ నెరవేరని కల అంటూ దునుమాడింది తనూశ్రీ.