సైరా ఈవెంట్: ఉయ్యాలవాడ ఫోటో ఏది?

Mon Sep 23 2019 12:07:42 GMT+0530 (IST)

No Uyyalavada Narasimha Reddy Pic in Sye Raa Pre Release Event

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుందనే సంగతి తెలిసిందే.   సినిమా విడుదలకు పది రోజులే ఉండడంతో ప్రమోషన్స్ నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి.  అందులో భాగంగా ఆదివారం నాడు 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగవైభవంగా జరిగింది.  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరుకావడంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకత చేకూరింది.'సైరా' సినిమాకు ఎక్కడ బీజం పడింది.. ఎన్ని సంవత్సరాల ముందు నుంచి ఈ సినిమాకు సన్నాహాలు జరిగాయనేది చిరు దగ్గర నుంచి పరుచూరి వారి వారకూ చాలామంది చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు పని చేసిన నటీనటులు.. టెక్నిషియన్స్ కూడా 'సైరా' గురించి గొప్పగా మాట్లాడారు.  పవన్ కళ్యాణ్.. రాజమౌళి కూడా ఈ సినిమా తెలుగువారి గౌరవాన్ని పెంచుతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఈవెంట్ అంతా బాగానే ఉంది కానీ ఒక విషయంపై మాత్రం నెటిజన్లు 'సైరా' టీమ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

అదేంటంటే వేదికపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఫోటోను పెట్టకపోవడం.  ఆ మహానుభావుడి కథపై ఈ స్థాయిలో సినిమా తీసి  ఆయన గురించి తెలపాలనే ప్రయత్నం మంచిదే కానీ ఈవెంట్లో ఉయ్యాలవాడ ఫోటో పెట్టకపోవడం సరికాదని అంటున్నారు. ఉయ్యాలవాడ చిత్రపటం పెట్టి ఒక పూలమాల వేసి ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది.  ఈ విషయంలో ఉయ్యాలవాడను అభిమానించేవారు ఫీల్ అవుతున్నట్టు సమాచారం.