ఖాళీగా ఉన్న పవన్ డైరెక్టర్స్..!

Tue May 24 2022 22:00:01 GMT+0530 (IST)

No Movies For Pawan Directors

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోతో వర్క్ చేయాలని ప్రతీ దర్శకుడికీ ఉంటుంది. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని.. తామేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా మారిపోవాలని ఆశ పడుతుంటారు. అలా పవన్ తో వర్క్ చేసే ఛాన్స్ అందుకున్న దర్శకులు ఇప్పుడు తదుపరి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయకపోవడం ఆశ్చర్యంకలిగించే విషయమే.'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఓ స్టార్ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ చేస్తారని అందరూ భావించారు. అయితే పవన్ మాత్రం కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న వేణు శ్రీరామ్ కు అవకాశం ఇచ్చారు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కిన 'వకీల్ సాబ్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. కరోనా పాండమిక్ వల్ల సినిమాకు దెబ్బ పడిందని పీకే ఫ్యాన్స్ అభిప్రాయ పడుతుంటారు.

'వకీల్ సాబ్' సినిమా ఫలితాన్ని పక్కన పెడితే.. ఆ సమయంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేలా చేసింది. రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా చేసిన మార్పులు చేర్పులు అభిమానులను ఆకట్టుకున్నాయి. కొందరైతే దర్శకుడికి గుడి కడతామంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫ్యాన్స్ చేత ఆ రేంజ్ లో ఎలివేట్ చేయబడిన వేణు.. ఇప్పటి వరకు తన నెక్స్ట్ మూవీని సెట్ చేసుకోలేకపోయారు.

అల్లు అర్జున్ తో ప్లాన్ చేసిన 'ఐకాన్ - కనబడుటలేదు' అనే చిత్రాన్ని వేణు మళ్లీ రీస్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హీరో ఎవరనేది చెప్పనప్పటికీ దర్శక నిర్మాతలు కూడా తదుపరి సినిమా 'ఐకాన్' అని తెలిపారు. కానీ ఏడాది దాటిపోయినా ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. అసలు వేణు శ్రీరామ్ ప్రస్తుతం ఏ మూవీ చేస్తున్నారనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు.

అలానే 'భీమ్లా నాయక్' చిత్రంతో సాగర్ కె చంద్ర కు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. 'అయప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ గా రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత వసూళ్ళు రాబట్టలేకపోయింది. అయితే దర్శకుడు సాగర్ కు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. వెనకుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతా చూసుకున్నారని కామెంట్స్ వచ్చినా.. సినిమా రిలీజ్ అయ్యాక సాగర్ కు దక్కాల్సిన క్రెడిట్ దక్కింది. అయితే ఇప్పటి వరకు అతను తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు.

సాధారణంగా క్రేజ్ ఉన్న దర్శకులకు వెంటనే పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు వస్తుంటాయి.. వెంటనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన వేణు శ్రీరామ్ మరియు సాగర్ కె చంద్ర లు మాత్రం నెలలు గడుస్తున్నా నెక్స్ట్ ఏంటి అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. మరి త్వరలోనే న్యూ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా కబురు వస్తుందేమో చూడాలి.

ఇకపోతే అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా అనౌన్స్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్.. ఇంతవరకు సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. జూన్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ ఆ మధ్య వెల్లడించారు. కానీ ఇప్పుడు మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం పవన్ ముందుగా తమిళ చిత్రం 'వినోదయ సీతమ్' రీమేక్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని డిసైడ్ అవ్వడమే అని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే హరీష్ శంకర్ మరికొన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ మీదనే ఉండనున్నారు. ఇక పవన్ తో 'కాటమ రాయుడు' సినిమా చేసిన తర్వాత దర్శకుడు డాలీ (కిషోర్ కుమార్ పార్థసాని) మరో ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. పవన్ తోనే మరో మూవీ చేస్తారని రూమర్స్ వచ్చాయి కానీ.. అవి నిజం కాలేదు. అసలు డాలీ ఇప్పుడు ఏం చేస్తున్నారనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు.

మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేస్తారు.. ఎప్పుడు సినిమా కంప్లీట్ చేస్తారనేది తెలియనప్పటికీ.. వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ చేస్తున్న 'హరి హర వీరమల్లు' మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అప్పట్లో ఓ మూవీ ప్రకటించారు. ఇప్పుడు యువ దర్శకుడు సుజీత్ కూడా లైన్ లోకి వచ్చారని వార్తలు వస్తున్నాయి.