సినిమాలకు మాంద్యం దెబ్బ లేదట..!

Wed Oct 09 2019 14:10:35 GMT+0530 (IST)

No Economical Crisis Effect on Film Industry

ఆర్థికమాంద్యం దెబ్బకు గతంలో ఎన్నడూ లేనంతగా మోడీ ప్రభుత్వం కుదేలవుతోంది. అందుకే  బ్యాంకులు - దేశ పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు ఉద్దీపనల మీద ఉద్దీపనలు ప్రకటించేస్తోంది. అయితే ఎంత చేసినా మాంద్యం దెబ్బకు దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి పరిస్థితులు అయితే మెరుగుపడడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.అయితే ఇంత మాద్యం లోనూ సినిమాలు మాత్రం ఆడేస్తున్నాయి. కోట్లు వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి సినిమా రంగానికి ఆర్థిక మాంద్యం దెబ్బ లేదే లేదన్నది సినిమా వ్యాపారంలో ఉన్న వారి మాట..

తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ దిగ్గజం పీవీఆర్ సినిమాస్ సీఈవో జ్ఞాన్ చందాని  మాంద్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం వల్ల సినిమా పరిశ్రమ మాత్రం సంతోషంగా ఉందని.. మా వ్యాపారం బాగుందని.. సమస్యలైతే ఏమీ లేవని స్పష్టం చేశారు. సినిమా కంటెంటో లేక మరేదో కానీ సినీ వ్యాపారం మాత్రం లాభాల్లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలు అధికంగా చూస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. మాంద్యంపై అపోహలు సృష్టిస్తున్నారని.. సినీ పరిశ్రమకు మాత్రం మాంద్యం వరంగా మారిందన్నారు.

పీవీఆర్ సినిమాస్ సంస్థ తొలి త్రైమాసికంలో భారీగానే లాభాలు సాధించింది. ఏకంగా 43 రెట్లు ఆదాయాన్ని పొందింది. వరల్డ్ కప్ నడిచిన సమయంలోనూ పీవీఆర్ సంస్థ 20శాతం లాభాలు పొందిందట.. ఇదే సమయంలో చైనాలో మాత్రం పరిస్థితి తలకిందులైంది. అక్కడ మాంద్యం దెబ్బకు ప్రముఖ సినిమాల సంస్థ వాండా ఫిల్మ్ హోల్డింగ్ కంపెనీ భారీగా నష్టాలపాలైంది.

ఇప్పుడు దేశంలో డిజిటల్ డేటా విప్లవం వచ్చాక అమేజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ లలో సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు అసలు జనాలు రాక సినిమా పరిశ్రమ కుదేలవుతోంది. ఇలాంటి సమయంలో కూడా పీవీఆర్ లాభాల వ్యాపారం చేయడం విశేషం. దీన్ని బట్టి సినిమాలు అధికంగా చూస్తున్నారని.. సినిమాలకు మాంద్యం ముప్పు లేదని సినిమా వర్గాలు చెబుతున్నాయి.