Begin typing your search above and press return to search.

ఇంతకీ మహాలక్ష్మి వస్తుందా రాదా?

By:  Tupaki Desk   |   18 April 2019 2:30 PM GMT
ఇంతకీ మహాలక్ష్మి వస్తుందా రాదా?
X
మూడేళ్ళ క్రితం బాలీవుడ్ లో సెన్సషనల్ హిట్ గా నిలిచిన క్వీన్ రీమేక్ ఒకేసారి నలుగురు వేర్వేరు హీరోయిన్లతో దర్శకులతో రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి ఫైనల్ కాపీ రెడీ చేసి కూర్చున్నారు. టీజర్ వచ్చి కూడా రెండు మూడు నెలలు అయ్యింది. దాని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేక టీమ్ సైలెంట్ అయిపోయింది.

తెలుగు వెర్షన్ లో తమన్నా టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. మొదట దర్శకుడిగా నీలకంఠ ఇది మొదలుపెట్టినప్పటికి ఏవో కారణాలతో ఆయన తప్పుకున్నారు. తన పేరు టైటిల్ కార్డులో వేయకూడదు అనే షరతు మీద అ!-కల్కి ఫేమ్ ప్రశాంత్ వర్మ దీన్ని పూర్తి చేసి ఇచ్చాడు. అంతే ఇక అక్కడి నుంచి క్వీన్ రీమేక్ తాలూకు విడుదల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సమయాన్ని సాగదీస్తూనే ఉన్నారు

తమిళ్ లో కాజల్ అగర్వాల్ తో కన్నడలో పరుల్ యాదవ్ మలయాళంలో మంజిమా మోహన్ తో గత ఏడాదిన్నర పాటు ఆపసోపాలు పడుతూ షూటింగ్ కానిచ్చారు. తీరా కీలక సమయంలో సైలెంట్ అవ్వడం వెనుక కారణాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎఫ్2 తో ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న మిల్కీ బ్యూటీ దటీజ్ మహాలక్ష్మితో మరో బ్రేక్ వస్తుందన్న నమ్మకంతో ఉంది.

తీరా చూస్తే ఎపుడు వస్తుందో అర్థం కానీ పరిస్థితి. మరోవైపు అటు టాలీవుడ్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు షెడ్యూల్ అయ్యున్నాయి. ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఈ నలుగురు సౌత్ క్వీన్లను థియేటర్లలో దింపకపోతే ఉన్న కాసింత ఆసక్తి కూడా చల్లారిపోయే ప్రమాదం ఉంది.