స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సినిమా పై బజ్ లేదే..!

Mon Jan 17 2022 13:04:16 GMT+0530 (IST)

No Buzz On Gehraiyaan movie

కరోనా నేపథ్యంలో గత రెండేళ్లలో ఎన్నో క్రేజీ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విడుదల అయ్యాయి. ముఖ్యంగా హిందీలో పెద్ద సినిమాలన్నీ డిజిటల్ వేదికల బాట పట్టాయి. థియేటర్లలో రిలీజ్ చేసిన సినిమాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్కువ శాతం బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఓటీటీ విడుదలకే మొగ్గు చూపుతున్నారు. మరికొన్ని రోజుల్లో నేరుగా ఓటీటీలోకి రాబోతున్న హిందీ చిత్రం ''గెహ్రైయాన్''.బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె - అనన్య పాండే - సిద్ధాంత్ చతుర్వేది - ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'గెహ్రైయాన్'. 'కపూర్ అండ్ సన్స్' ఫేమ్ శకున్ బత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

'గెహ్రైయాన్' చిత్రాన్ని ముందుగా జనవరి 25న స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు వాలెంటైన్స్ వీక్ లో 2022 ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు అమెజాన్ వీడియో వారు ప్రకటించారు. స్టార్ క్యాస్టింగ్ - పెద్ద నిర్మాణ సంస్థలు - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కలిసి చేసిన సినిమా అయిన్నప్పటికీ.. ఈ సినిమాపై ఎలాంటి బజ్ ఏర్పడలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమాకు సంబంధించి ఎటువంటి సందడి లేకపోవడం గమనార్హం.

విడుదల వేదిక ఏదైనా ఎంత పెద్ద సినిమా అయినా.. జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషనల్ కార్యక్రమాలు అనేవి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 'గెహ్రైయాన్' సినిమాకు సంబంధించి క్యారక్టర్ పోస్టర్స్ మరియు టీజర్ మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ దీపికా పడుకునే వంటి స్టార్ హీరోయిన్ నటించే సినిమా వస్తుందని ఎవరికీ పెద్దగా తెలియడం లేదు.

'గెహ్రైయాన్' ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు.. ట్రైలర్ లాంచ్ తేదీని కూడా అమెజాన్ ప్రైమ్ వారు ప్రకటించలేదు. దీంతో దీపికా పదుకొణె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ ని ఆవిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీపికా తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి నటించి నిర్మించిన '83' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అందుకే ఇప్పుడు గెహ్రైయాన్ తో అగ్ర కథానాయిక సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మేకర్స్ రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ ముమ్మరం చేసి సినిమాపై బజ్ తీసుకొస్తారేమో చూడాలి.