ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను రంగంలోకి దింపుతున్న నితిన్!

Sun Jan 16 2022 11:38:20 GMT+0530 (IST)

Nithin bringing that music director

తెలుగులో సంగీత దర్శకులుగా తమన్ .. దేవిశ్రీ ప్రసాద్ .. మణిశర్మ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురి చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ముగ్గురూ కూడా ఇటు క్లాస్ టచ్ .. అటు మాస్ టచ్ ఉన్న బీట్స్ ఇవ్వడంలో సిద్ధహస్తులే. అందువలన స్టార్ హీరోల సినిమాలతో ముగ్గురూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. చిన్న సినిమాలు .. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు చేయరని కాదుగానీ వాళ్లకి అంతటి తీరిక లేదనేది మాత్రం స్పష్టం. అందువలన ఆ తరువాత వరుసలో ఉన్న సంగీత దర్శకులని మిగతా దర్శక నిర్మాతలు ఆశ్రయిస్తున్నారు.మహతి స్వరసాగర్ .. అనూప్ రూమేన్స్ .. మిక్కీ జె మేయర్ కూడా తమ సినిమాలతో సతమతమవుతున్నారు. వీరితో పాటలు చేయించుకోవలన్నా కొంతకాలం వెయిట్ చేయవలసిందే. ఇక కొంతకాలం క్రితమే టాలీవుడ్ కి పరిచయమైన గోపీ సుందర్ .. గిబ్రాన్ .. హారీస్ జైరాజ్ జోరు కాస్త తగ్గింది. అయితే ఇతర భాషల్లోని సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటమే అందుకు కారణమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురిలో హారీస్ జైరాజ్ బాణీలు యూత్ ను ప్రధానంగా చేసుకుని నడుస్తాయి. ఆయనకి యూత్ నుంచే ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఈ కారణంగానే హీరో నితిన్ ఆయనను రంగంలోకి దింపాడు. నితిన్ సినిమాకి తాను వర్క్ చేస్తున్నట్టుగా హారీస్ జైరాజ్ స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నాడు. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా కృతి శెట్టి అలారించనుండగా కీలకమైన పాత్రలో కేథరిన్ కనువిందు చేయనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలోనే నితిన్ తన నెక్స్ట్ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకుని వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా' తరువాత ఆయన రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రీలీల .. మీనాక్షి చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసమే హారీస్ జైరాజ్ ను తీసుకున్నారు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో ఆయన గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. టాలీవుడ్ లో మళ్లీ ఆయన జోరు కొనసాగుతుందేమో చూడాలి.