నితిన్ - వక్కంతం వంశీ కాంబో సెట్ చేస్తున్న 'క్రాక్' నిర్మాత..?

Mon May 03 2021 17:00:02 GMT+0530 (IST)

Nithin Vakkantam Vamsi combo

సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై 'క్రాక్' సినిమాని నిర్మించి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు. అయితే తమిళ నిర్మాతలతో ఉన్న ఆర్ధికపరమైన లావాదేవీల కారణంగా 'క్రాక్' సినిమా విడుదలపై కోర్టు స్టే విధించడంతో వార్తల్లో నిలిచారు. 'క్రాక్' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన 12 లక్షల రూపాయల బ్యాలెన్స్ అమౌంట్ ఠాగూర్ మధు ఇవ్వడం లేదంటూ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని ఫిర్యాదు చేయడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారింది. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఇలా జరిగిందని నిర్మాత క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఇండస్ట్రీలో చాలా మందికి డబ్బులు సెటిల్ చేయలేదనే అపవాదు మూటగట్టుకున్నాడు.ఈ వివాదాలన్నీ పక్కనపెడితే ఇప్పుడు ఠాగూర్ మధు కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్ తో ఓ మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. 'రేసుగుర్రం' 'కిక్' 'టెంపర్' 'ఎవడు' వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ.. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ కోసం అధ్బుతమైన కథను రెడీ చేసి హీరో నుంచి పాజిటివ్ సిగ్నల్ తెచ్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి త్వరలోనే ఠాగూర్ మధు నిర్మాణంలో నితిన్ - వక్కంతం వంశీ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.