హ్యాట్రిక్ మూవీకి రెడీ అయిన 'స్వామిరారా' టీమ్..!

Fri Oct 15 2021 20:18:36 GMT+0530 (IST)

Nikhil Movie with Sudheer Varma

టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్ - కలర్స్ స్వాతి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ''స్వామిరారా''. 2013లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో అద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేశారు సుధీర్. ఇది హీరో నిఖిల్ కెరీర్ కు కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అందుకే ఆ తర్వాత నిఖిల్ - సుధీర్ కలిసి ''కేశవ'' అనే మరో సినిమా చేశారు. ఇది కూడా భిన్నమైన సినిమానే అయినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే వీరిద్దరూ ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ కోసం జత కడుతున్నారు.దసరా పండుగ సందర్భంగా నిఖిల్ సిద్దార్థ్ - సుధీర్ వర్మ కాంబోలో రూపొందే మూడో చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద BVSN ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ బ్యానర్ లో నిర్మించబడే 32వ ప్రాజెక్ట్ ఇది. నవంబర్ 1న ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ కోసం 40 రోజుల లండన్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. రిచర్డ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా.. కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తారు. ఈ సినిమా తారాగణం మరియు సిబ్బంది గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇకపోతే నిఖిల్ ఇటీవలే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. అలానే చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎడిటర్ గ్యారీ బీహెచ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ స్పై థ్రిల్లర్ ను మొదలు పెట్టారు. ఈ క్రమంలో సుధీర్ వర్మతో నిఖిల్ జత కట్టనున్నారు. మరోవైపు దర్శకుడు సుధీర్ దక్షిణ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ కామెడీ చిత్రంలో రెజీనా కాసాండ్రా - నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ సంస్థకు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.