నడిరోడ్డుపై పైరసీ సీడీలు..నిఖిల్ ఏం చేశాడంటే!

Sun Dec 08 2019 16:14:54 GMT+0530 (IST)

Nikhil Catches His Film Piracy CD Vendor Red-Handed

పైరసీ భూతం సినీపరిశ్రమల్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రిలీజైన సినిమా అలా పైరసీలో రిలీజైపోవడమే గాక బహిరంగ మార్కెట్లో సీడీలు - డీవీడీల రూపంలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇది నిరంతర క్రతువు. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమాలన్నీ అప్పుడే నడిరోడ్లులో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం రిలీజయ్యే సినిమాల పరిస్థితి ఇదే.అసలు ఈ పైరసీ ఎక్కడ పుడుతోంది?  ఎలా పుడుతోంది? అన్నదానికి ఎవ్వరూ పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. తమిళ్ రాకర్స్ సహా తెలుగు ఇండస్ట్రీలోనూ పైకి కనిపించని మాఫియా రన్ అవుతోందన్నది చాలామంది ఆరోపణ. ఫిలింఛాంబర్ లో పైరసీ సెల్ అందులో ఉద్యోగులు ఉత్సవ విగ్రహాలా? అన్న సందేహం కలుగుతుంటుంది. ఇక సైబర్ పోలీస్ సైతం కొంతకాలం హడావుడి చేసినా పూర్తిగా పైరసీని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. వ్యవస్థలోని దొంగలంతా ఏకమై టాలీవుడ్ ని దోచుకుంటున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.

లేటెస్టుగా యంగ్ హీరో నిఖిల్ ఓ పైరసీ సీడీల షాప్ ని బహిరంగంగా పట్టుకున్నాడు. తాను నటించిన అర్జున్ సురవరం ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే.. సీడీలు విక్రయిస్తున్న తోపుడు బండిని డైరెక్టుగా వీడియో సాక్షిగా చూపించాడు. రాజుగారి గది.. అర్జున్ సురవరం సహా ఇటీవల రిలీజైన సీడీలు అన్నీ ఆన్ రోడ్ షాప్ లో అమ్మేస్తున్నారు. ఇక ఆ సీడీలు అమ్మే ఆవిడను నిఖిల్ పబ్లిగ్గా పట్టుకుని సినిమావాళ్ల బాధల్ని వివరించి చెప్పిన తీరు బావుంది. రూ.40 కే మూడు సినిమాలు ఒకే సీడీలో లభ్యమవుతున్నాయి. ఓవైపు సినిమా థియేటర్లలో బాగా ఆడుతోందన్న ఆనందం ఉంది. మరోవైపు ఇలా సీడీలు అమ్మేస్తున్నారు! అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిఖిల్. రోడ్ లో టీ తాగేందుకు ఆగి నడిరోడ్డుపై తోపుడు బండిపై ఉన్న సీడీ షాప్ ని పట్టుకోవడం ఆసక్తికరం. ఇక ఆ సీడీ బండి ఆవిడ కుటుంబం విషయంలో విచారం వ్యక్తం చేస్తూనే ఒక్కో సినిమాపై ఆధారపడి జీవించే 800 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని వివరించే ప్రయత్నం చేశాడు. నిఖిల్ చేసిన ఈ పని ప్రశంసించదగినది అనడంలో సందేహమే లేదు.