Begin typing your search above and press return to search.

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమాలు ఇవే..!

By:  Tupaki Desk   |   23 Nov 2021 11:30 PM GMT
ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమాలు ఇవే..!
X
కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత సినిమాలన్నీ వరుసగా విడుదల అవుతున్నాయి. కొన్ని థియేట్రికల్ రిలీజ్ అవుతుంటే.. మరికొన్ని ఓటీటీ బాట పడుతున్నాయి. వేదిక ఏదైనా చిన్నవో పెద్దవో వారానికి అర డజనుకు పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే శుక్రవారం కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు అటు థియేటర్ తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమాల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం!

'దృశ్యం 2': ఇది విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసఫ్‌ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. మలయాళ బ్లాక్ బస్టర్ 'దృశ్యం 2' యొక్క తెలుగు రీమేక్.. 2014లో వచ్చిన 'దృశ్యం' చిత్రానికి సీక్వెల్‌. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 25 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు.

'అనుభవించు రాజా': రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గావిరెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో కషికా ఖాన్ హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ - శ్రీ వేంకటేశ్వర సినిమాస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

'క్యాలీఫ్లవర్': బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఆర్కే మలినేని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమిది. 'శీలో రక్షతి రక్షితః' అన్నది దీనికి ఉపశీర్షిక. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఆడాళ్ల శీలానికే కాదు.. మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే విభిన్నమైన కాన్సెప్టుతో ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాని తీర్చిదిద్దారని తెలుస్తోంది. మధుసూధన క్రియేషన్స్ - రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 26న థియేటర్లలోకి వస్తోంది.

'ఆశ ఎన్ కౌంటర్': యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ దుర్ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019 నవంబర్ 26న నగరశివారులోని చటాన్ పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. దారుణంగా హత్య చేశారు. ఇదే నేపథ్యాన్ని చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాని నవంబర్ 26వ తేదీనే థియేటర్లలో విడుదల చేస్తుండటం గమనార్హం. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మించారు.

'ది లూప్': తమిళ స్టార్ హీరో శింబు నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇది టైం లూప్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్టన్ థ్రిల్లర్. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ - ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

#BRO: టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర - అవికా గోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. ఇందులో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా కాకుండా అన్నాచెల్లెళ్లుగా కనిపించనున్నారు. కార్తీక్ తురుపాని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. మ్యాంగో మాస్ మీడియా సంస్థ సమర్పణలో జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ - ఎస్టీటీవీ ఫిలిమ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. #బ్రో మూవీని సోనీ లివ్ ఓటీటీలో నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నారు.

వీటితోపాటుగా '1997' - 'కార్పోరేట్' - 'భగత్ సింగ్ నగర్' వంటి చిన్న సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. అలానే ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్ అయిన 'రొమాంటిక్' 'రిపబ్లిక్' వంటి సినిమాలు కూడా నవంబర్ 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.