Begin typing your search above and press return to search.

గోవిందావ‌తార్! హ‌త‌విధీ.. ఏంటీ నెటిజ‌నుల‌ కామెడీలు?

By:  Tupaki Desk   |   24 Nov 2022 3:30 PM GMT
గోవిందావ‌తార్! హ‌త‌విధీ.. ఏంటీ నెటిజ‌నుల‌ కామెడీలు?
X
అవతార్ సినిమాల రెండవ భాగం 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ఈ డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్ప‌టికే రెండు ట్రైల‌ర్లు రిలీజ్ కాగా సంచ‌ల‌నం సృష్టించాయి. అవ‌తార్ 2పై భారీ అంచ‌నాల్ని పెంచాయి. ఇంత‌లోనే మూడో ట్రైల‌ర్ రిలీజ్ కి కామెరూన్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా 160పై గా దేశాల్లో విడుద‌ల‌వుతోంది. భార‌త‌దేశంలో అన్ని ప్రాంతీయ భాష‌ల్లో వ‌స్తోంది. ఇప్ప‌టికే భార‌త‌దేశంలో ఈ సినిమాపై విస్త్ర‌త ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ త్రోబ్యాక్ వీడియో గుబులు పుట్టిస్తోంది. బాలీవుడ్ ప్ర‌ముఖ వెట‌ర‌న్ హీరో గోవిందాను నెటిజ‌నులు ట్రోల్ చేస్తూ 'గోవిందావ‌తార్' గా మార్చారు.

ఇంత‌కీ గోవిందా అంత పెద్ద త‌ప్పేమి చేశారు? ఆయ‌న‌ను బులుగు రంగు అవ‌తార్ రూపంలోకి ఎందుకు మార్చారు? ఈ మార్ఫింగ్ స్టోరీ ఏంటీ? అస‌లు ఆయ‌న‌ సోష‌ల్ మీడియాల్లో డిబేట్ గా ఎందుకు మారారు? అంటే అస‌లు సంగ‌తి తెలుసుకోవాల్సిందే.

గోవిందా తెలిసో తెలియ‌కో తొమ్మిదేళ్ల క్రితం ఒక మీడియ లైవ్ లో ఓ మాట‌న్నారు. జేమ్స్ కామెరూన్ కి 'అవతార్' అనే పేరును సూచించింది తానేనని.. ఈ సినిమా పెద్ద‌ హిట్ అవుతుందని 9 ఏళ్ల క్రితమే అంచనా వేసాన‌ని గోవిందా ఈ పాత వీడియోలో చెప్పాడు. అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

వీడియో క్లిప్ లో గోవిందా జర్నలిస్ట్ రజత్ శర్మతో మాట్లాడుతూ.. జేమ్స్ కామెరూన్ 2009 బ్లాక్ బస్టర్ మూవీ 'అవ‌తార్'లో తనకు ప్రధాన పాత్రను ఆఫర్ చేశారని అయితే తన శరీరంపై పెయింట్ వేయడానికి ఇష్టపడనందున దానిని తిరస్కరించానని చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మరో ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ కూడా చెప్పారు. ''ఆ సినిమాకు అవతార్‌ టైటిల్ సూచించింది నేనే'' అని కూడా అన్నారు. ''ఆ త‌ర్వాత అది సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సినిమా బాగా ఆడుతుందని నేను అతనికి (జేమ్స్ కామెరూన్) తెలియజేశాను. ఆయన సినిమా పూర్తి చేయడానికి ఏడేళ్లు పడుతుందని చెప్పాను'' అని కూడా చెప్పారు. అయితే ఆఫ‌ర్ తిర‌స్క‌రించినందుకు అతనికి (కామెరూన్ కి) కోపం వచ్చింది అని కూడా గోవిందా అన‌డం ఫ‌న్ ని క్రియేట్ చేసింది.

అయితే గోవిందా చెప్పింది నిజ‌మా కాదా? అంటూ తెలివైన నెటిజ‌నం చాలా ఆరాలు తీసారు. అదే క్ర‌మంలో తెలిసొచ్చిన అస‌లు నిజం ఏమంటే.... నిజానికి అవ‌తార్ లో ఏ పాత్ర‌కు కూడా బాడీ పెయింటింగ్ వేయ‌లేదు. వేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఆ మాట‌కొస్తే ఈ భారీ చిత్రంలో బాడీ పెయింట్ ప్రమేయమే లేదు. పండోరా ప్రజల నీలిరంగు చర్మం CGI .. మోషన్ క్యాప్చర్ టెక్నిక్ ద్వారా సృష్టించినది. కేవ‌లం గ్రీన్ మ్యాట్ బ్లూమ్యాట్ లో తెర‌వెన‌క ఒరిజిన‌ల్ స్టార్లు మూవ్ మెంట్స్ ఇవ్వాలి అంతే. కాబట్టి అతని ప్రకటనను ప్రజలు నమ్మలేదు. అందువల్ల నెటిజ‌నులు గోవిందాను ఒక రేంజులో ఆడుకున్నారు. అత‌డి త్రోబ్యాక్ వీడియోను షేర్ చేస్తూ దానికి ఉల్లాసకరమైన కామెంట్ల‌తో చెల‌రేగారు.

ఇప్పుడు అవ‌తార్ 2 ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌ల‌వుతోంది. ఈ నేప‌థ్యంలో తొమ్మిదేళ్ల నాటి ఆ వీడియోని తిరిగి వైర‌ల్ చేస్తూ నెటిజ‌నులు చాలా కామెడీలు చేస్తున్నారు. గోవిందావ‌తార్! అంటూ అత‌డి గెట‌ప్ ని కూడా మార్చి ఈ బ్లూ క‌ల‌ర్ ఫోటోని వైర‌ల్ చేస్తున్నారు. మొత్తానికి గోవిందాను అవ‌తార్ గా మార్చి పాన్ ఇండియ‌న్ బంప‌ర్ హిట్టుని ఈ తుంటరి నెటిజ‌నులే తీసేట్టున్నారు!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.