'నేనే నా?!' ట్రైలర్: వందేళ్ళ క్రితం నాటి భయంకరమైన సంఘటన మళ్ళీ జరిగితే..!

Tue Sep 14 2021 18:25:28 GMT+0530 (IST)

Nene Na Trailer Talk

తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న చెన్నై భామ రెజీనా కసాండ్ర.. ఇప్పుడు ''నేనే నా?!'' అనే ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ్ లో ‘సూర్పనగై’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఓ ఫారినర్ మిస్సయ్యాడని చెప్పడంతో ప్రారంభమైన ''నేనే నా?!'' ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక అదృశ్య శక్తి అడవిలో వరుస హత్యలు చేస్తుండగా.. ఈ మిస్టరీ కేసుని చేధించే క్రమంలో నమ్మశక్యం కాని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చూపించారు. ఆ హత్యల వెనుక 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఉందని చెబుతూ ఆసక్తి రేకెత్తించారు.

ఇందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించే ఆర్కియాలజిస్ట్ గా రెజీనా కసాండ్ర కనిపిస్తోంది. అయితే అదే సమయంలో వందేళ్ల క్రితం నాటి కథలో మహారాణి గెటప్ లో ఉంది. రెండు వేర్వేరు కాలాలకు చెందిన కథను చూపిస్తూ థ్రిల్ కలిగించేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'నిను వీడని నీడను నేనే' వంటి వైవిధ్యమైన సినిమాతో మెప్పించిన డైరెక్టర్ కార్తీక్ రాజ్.. ''నేనే నా?!'' సినిమాలో మరో క్కొత్త కథను ఆవిష్కరించే ప్రయత్నం చేసారనిపిస్తోంది.

వందేళ్ల కిందట జరిగిన భయానక ఘటన ఏంటి? ఆ హత్యలకు గల కారణాలు ఏమిటి? సూర్పణక ఎవరు? వంటి విషయాలు తెలియాలంటే ''నేనే నా?!'' సినిమా చూడాల్సిందే. ఇందులో రెజీనా రెండు పాత్రల్లోనూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం రెజినా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. వెన్నెల కిషోర్ - అక్షర గౌడ - జేపీ - తాగుబోతు రమేష్ - జీవ రవి - మైఖేల్ - కౌశిక్ - యోగి - రవిరాజా తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

''నేనే నా?!'' ట్రైలర్ లో శ్యామ్ సీఎస్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ - సినిమాటోగ్రాఫర్ గోకుల్ బెనోయ్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శీను ఆర్ట్ డైరెక్టర్ గా.. సాబు జోషెఫ్ ఎడిటర్ గా వర్క్ చేశారు. సూపర్ సుబ్బరాయన్ ఈ సినిమాలో యాక్షన్ డిజైన్ చేశారు. యాపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.