మూవీ రివ్యూ : ‘నేల టిక్కెట్టు’

Fri May 25 2018 14:47:26 GMT+0530 (IST)

Nela Ticket Review

చిత్రం : ‘నేల టిక్కెట్టు’నటీనటులు: రవితేజ - మాళవిక శర్మ - జగపతిబాబు - సంపత్ రాజ్ - ఆలీ - ప్రవీణ్ - కౌముది - శరత్ బాబు - పోసాని కృష్ణమురళి - పృథ్వీ - బ్రహ్మానందం - జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
ఛాయాగ్రహణం: ముకేష్
నిర్మాత: రామ్ తాళ్ళూరి
రచన - దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల

మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరు రవితేజ. ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో మంచి విజయాలందుకున్న కళ్యాణ్ కృష్ణ.. మాస్ రాజాతో అతడి స్టయిల్లో తీసిన సినిమా ‘నేల టిక్కెట్టు’. రామ్ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందకొచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అనాథగా పెరుగుతూ అందరితో నేల టిక్కెట్టు (రవితేజ) అని పిలిపించుకునే కుర్రాడికి జనాలంటే పిచ్చి. చుట్టూ జనం ఉండాలి. మధ్యలో మనం ఉండాలి అనుకునే రకం అతను. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక బంధుత్వం కలుపుకునే అతను ఎవరికే కష్టం వచ్చినా ఆగలేడు. అందరి సమస్యల్ని తన సమస్యలుగా భావించి సాయపడుతుంటాడు. అందుకోసం ఎంతటి వాళ్లనైనా ఎదిస్తుంటాడు. అలాంటివాడు అనుకోకుండా రాష్ట్ర హోం మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు) మనుషులతో తలపడాల్సి వస్తుంది. ముందు హీరోను హోం మంత్రి తేలిగ్గా తీసుకుంటాడు కానీ.. ఆ తర్వాత అతను పెద్ద తలనొప్పిగా మారతాడు. అప్పుడే హీరో ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంతకీ అతను హోం మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు.. అతడి గతమేంటి.. హోం మంత్రిపై పోరాటంలో అతనెలా విజయం సాధించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

పాపం ఈ మధ్య తెలుగు సినిమా హీరోల శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి బలహీనులుగా.. సామాన్యులుగా మారిపోయారు కానీ.. ఒకప్పుడు మాత్రం వాళ్ల రేంజే వేరుగా ఉండేది. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే హీరో బేసిగ్గా అనాథ అయి ఉంటాడు. ఏ పనీ చేయడు. కానీ అతడికి ఏ కష్టం ఉండదు. ఏమనుకుంటే అది చేసేస్తాడు. ఎవరు కష్టాల్లో ఉన్నా చూడలేడు. అందరినీ ఆదుకుంటూ ఉంటాడు. రౌడీలు కనిపిస్తే చాలు ముందు వెనుక చూసుకోకుండా మీదపడిపోతాడు. విలన్ రాష్ట్రాన్ని.. దేశాన్ని ఏలే వాడైనా పట్టించుకోడు. ఎదురెళ్తాడు. వందల మంది బలగాన్ని ఒక్కడే ఎదుర్కొంటాడు. హీరోయినేమో పెద్దింటి అమ్మాయి అయి ఉంటుంది. హీరో ఒక ఫైట్ చేయగానే ఫిదా అయిపోతుంది. అతడి ప్రేమలో పడిపోతుంది. ఇద్దరూ అరగంటకోసారి టైం చూసుకుని డ్యూయెట్లు వేసుకుంటారు. మరోవైపు విలన్.. హీరోను వంచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. క్లైమాక్స్ టైం రాగానే టైం అయిందని సరెండర్ అయిపోతాడు.

ఈ ఫార్మాట్లో అప్పట్లో ఎన్నెన్ని సినిమాలు చూశామో? ‘నేల టిక్కెట్టు’ అంటూ ఈ తరానికి తెలియని పాత రోజుల్లోని పదాన్ని టైటిల్ గా పెట్టుకున్న కళ్యాణ్ కృష్ణ కురసాల.. సినిమా కూడా అప్పటిదే చూపించాడు. చాలా సాధారణంగా.. రొటీన్ గా.. డల్లుగా కనిపించిన ‘నేల టిక్కెట్టు’ టీజర్.. ట్రైలర్లను చూసి ఎంత తక్కువ అంచనాలతో వెళ్లినా కూడా డిజప్పాయింట్ చేసేలా సినిమాను తీర్చిదిద్దాడు. 2 గంటల 45 నిమిషాల నిడివిలో భూతద్దం పెట్టి వెతికినా ఒక్కటంటే ఒక్క సీన్ కొత్తగా లేదంటే ‘నేల టిక్కెట్టు’ ఎలాంటి సినిమానో అర్థం చేసుకోవచ్చు. కొత్తదనం లేకపోతే పోనీ.. కనీసం మాస్ ప్రేక్షకుల్ని అలరించే మినిమం ఎంటర్టైన్మెంట్ అయినా ఉందా అంటే అదీ లేదాయె. అరిగిపోయిన కథ.. ఆసక్తి రేకెత్తించని కథనం.. బలహీనమైన.. పేలవమైన పాత్రలు..  లాజిక్ లేని.. అతకని సన్నివేశాలు.. ఇలా అన్ని రకాలుగా ‘నేల టిక్కెట్టు’ ఒక అర్థ రహితమైన సినిమాకు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తుంది.

హీరో ఎక్కడి నుంచో ఉన్నట్లుండి హైదరాబాద్ కు ఊడిపడతాడు. కష్టాల్లో ఉన్న వాళ్లను  కాపాడే  క్రమంలో విలన్ తమ్ముడిని కొట్టేస్తాడు. తర్వాత వెళ్లి సారీ చెబుతాడు. కానీ అక్కడ అతడిచ్చే బిల్డప్ చూసి హీరో విలన్ కు వార్నింగ్ ఇచ్చాడనుకుంటారు. కట్ చేస్తే కొన్ని రోజులు తిరగ్గానే హోం మంత్రి అయిన విలన్ సీఎం అయిపోవాలనుకుంటాడు. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి డబ్బు అవసరమై ట్రక్కులో వెయ్యి కోట్లు తెప్పిస్తుంటాడు. సీఎంకు ఏం చేయాలో పాలుపోదు. అప్పుడు ఆయనకు ఎవరో సలహా ఇస్తారు మన హీరో గురించి... వాడు హోం మంత్రికే వార్నింగ్ ఇచ్చాడని. అంతే సీఎం సారుకు ఇంకెవరూ దొరకనట్లు డబ్బులు మళ్లించే టాస్క్ హీరో గారికే అప్పగిస్తాడు. ఇలా సినిమాలో ఎవరికే పని కావాలన్నా మన హీరోనే కావాలి. ఇలా అందరి సమస్యలు తీర్చడం తప్ప పనేమీ లేనట్లు 80లు.. 90ల నాటి కథానాయకుడి స్టయిల్లో చెలరేగిపోతుంటాడు హీరో. కట్ చేస్తే ముందు లైట్ గా కనిపించి.. ఇంటర్వెల్ రాగానే హీరో ఒక ఉద్దేశం ప్రకారమే ఇదంతా చేస్తున్నాడని గత దశాబ్దం కాలంగా మనకు బాగా అలవాటైన ‘ట్విస్టు ఒకటిస్తారు. ఇక ద్వితీయార్ధంలో ఆటోమేటిగ్గా హీరో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. వర్తమానంలోకి రాగానే హీరో-విలన్ ఎత్తులు పై ఎత్తులు వేసుకుని చివరగా కథను క్లైమాక్సుకు తీసుకెళ్లిపోతారు. ఇదీ పరమ రొటీన్ గా సాగిపోయే ‘నేల టిక్కెట్టు’ వ్యవహారం.

రవితేజ సినిమా అంటే కథా కథనాల సంగతెలా ఉన్నా కనీసం కామెడీకి ఢోకా ఉండదని.. అతను తనదైన అల్లరితో ఎంటర్టైన్ చేసేస్తాడని ఒకప్పుడు ఒక నమ్మకం ఉండేది. కానీ ఆ భరోసా కూడా నెమ్మదిగా సడలిపోతోంది. ‘టచ్ చేసి చూడు’లోనే రవితేజ ఏమీ చేయలేక చేతులెత్తేస్తే ఇందులో మరింతగా నీరసించిపోయాడు. అతడి మార్కు వినోదం పండించడానికి కూడా అవకాశాలు లేకుండా చేతులు కట్టేశాడు కళ్యాణ్ కృష్ణ. ఒక సీన్లో ‘‘కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా’’ అంటూ ‘ఇడియట్’ డైలాగ్ పేలుస్తాడు రవితేజ. ఆ సీన్లో కామెడీ కోసం రవితేజ అండ్ కో పడ్డ ప్రయాస చూసి.. ‘ఇడియట్’ రోజులు గుర్తు తెచ్చుకుని పాపం రవితేజ పరిస్థితి ఇలా తయారైందేంటని బాధ పడటం తప్ప ఏమీ చేయలేం. బ్రహ్మానందం లాంటి నటుడిని పెట్టుకుని ఒక్క డైలాగ్ ఇవ్వకుండా ఊరికే అలా కూర్చోబెట్టేయడాన్ని బట్టి దర్శకుడు వనరుల్ని ఎలా ఉపయోగించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. చుట్టూ జనం.. మధ్యలో మనం అన్న డైలాగుకి తగ్గట్లుగా సినిమా అంతటా జనసందోహమే కనిపిస్తుంది. కానీ ఒక్క సీన్ పేలితే ఒట్టు. రవితేజ నుంచి ఇలాంటి పేలవమైన సినిమాలు గతంలోనూ కొన్ని చూశాం. కానీ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సినిమాలతో సత్తా చాటుకున్న కళ్యాణ్ కృష్ణ ఇలాంటి సినిమా తీయడమే జీర్ణించుకోలేని విషయం.

నటీనటులు:

రవితేజ కొత్తగా చేసిందేమీ లేదు. అతనేదైనా చేయడానికి ఈ సినిమా ఎంతమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడూ చూసే నటనే.. అదే బాడీ లాంగ్వేజే.. అవే డైలాగులు. అతడి నుంచి మాస్ ప్రేక్షకులు ఆశించే వినోదం కూడా కరవైంది ఇందులో. హీరోయిన్ మాళవిక శర్మ చూడ్డానికి బాగానే ఉంది కానీ.. రవితేజ పక్కన ఏమాత్రం సూటవ్వలేదు. మాస్ రాజా పక్కన ఆమె మరీ చిన్నమ్మాయిలా కనిపించింది. ఆమెది వ్యర్థ పాత్ర. కేవలం పాటల కోసమే పనికొచ్చింది. ఒక సీన్లో మాళవికకు కొంచెం నటించాల్సిన అవసరం వచ్చింది. బహుశా ఆ సీన్ ముందు తీసి.. ఆమె హావభావలు చూశాక మిగతా సీన్లలో ఆమెకు ఏమాత్రం స్కోప్ లేకుండా చూసుకున్నారేమో అనిపిస్తుంది. విలన్ గా జగపతిబాబు కూడా వేస్టయిపోయాడు. పాత్ర పేలవంగా ఉండటంతో ఆయన చేతులు కూడా కట్టేసినట్లే అయింది. పృథ్వీ.. జయప్రకాష్ రెడ్డి.. బ్రహ్మానందం.. ఆలీ.. ప్రవీణ్.. ప్రియదర్శి.. ఇలా చాలామంది కమెడియన్లున్నా ఎవ్వరూ నవ్వించలేకపోయారు. సంపత్ రాజ్ పాత్ర కూడా వేస్టే అయింది.

సాంకేతికవర్గం:

‘ఫిదా’తో సత్తా చాటుకున్న సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ కు ఈసారి తన ప్రతిభ చూపించే అవకాశం లేకపోయింది. ఇలాంటి సినిమాకు అతను సూటవ్వలేదనిపిస్తుంది మ్యూజిక్ వింటే. ఐలవ్యూ... అంటూ సాగే ఒక పాట బాగుంది కానీ.. అది సినిమాలో సెట్టవ్వలేదు. మాస్ బీట్స్ కోసం అతను చేసిన ప్రయత్నం ఏమాత్రం మెప్పించలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మామూలే. ముకేష్ ఛాయాగ్రహణం ఓకే. సినిమాలో కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఛేజింగ్ సీక్వెన్స్ బాగా చిత్రీకరించాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక రచయిత.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీవ్రంగా నిరాశ పరిచాడు. అన్ని విభాగాల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఇంతకుముందు పాత కథల్నే కొంచెం కొత్తగా చెప్పే ప్రయత్నం చేసిన కళ్యాణ్.. ఈసారి పాత కథను ఎంచుకుని చాలా పాత స్టయిల్లో చెప్పాడు. ఇలాంటి కథ ఈ కాలంలో ఎలా వర్కవుటవుతుందని అతను ఆశించాడో తెలియదు మరి. సోగ్గాడే.. రారండోయ్.. సినిమాల్ని తీసింది ఈ దర్శకుడేనా అనిపించేలా ‘నేల టిక్కెట్టు’ను తీర్చిదిద్దాడతను.

చివరగా: నేల టిక్కెట్టు.. నేలటిక్కెట్ రోజుల నాటి సినిమా

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre