ఆ రాత్రంతా తన రూంలో ఉండమన్న సౌత్ నిర్మాత ఎవరు?

Fri Jun 18 2021 10:00:01 GMT+0530 (IST)

Neena Gupta Talking About Her Horrible Experience

బాలీవుడ్ సీనియర్ నటి నీనాగుప్తా సంచలన అంశాల్ని బయటపెట్టారు. తాజాగా ఆమె తన బయోగ్రఫీలో ఇప్పటివరకు బయటపెట్టని ఎన్నో విషయాల్ని వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చి అప్పట్లో పెను సంచలనంగా మారారు. మళ్లీ పెళ్లి.. విడాకులు.. ఒంటరి తల్లిగా ఆమె ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిపేది. తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఏన్నో విషయాల్ని 'సచ్ కహున్ తో' పేరుతో రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా తాను సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన వైనాన్ని వివరంగా వెల్లడించారు. కాకుంటే.. తాను ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితికి కారణమైన ప్రముఖ నిర్మాత పేరును మాత్రం ఆమె రివీల్ చేయలేదు. అసలేం జరిగిందంటే..

దక్షిణాదికి చెందిన నిర్మాత ఒకరు తనను హోటల్ రూంకు రావాలని కోరినట్లు చెప్పారు. ఆ హోటల్ రూం ముంబయిలోని పృథ్వీ థియేటర్‌కు దగ్గర్లోనే ఉంటుందన్నారు. అప్పటికే తాను షూటింగ్ లో ఉన్నానని.. ఆ రోజు షెడ్యూల్ పూర్తి కాగానే సదరు నిర్మాత ఫోన్ చేసి హోటల్ కు రావాలని చెప్పారన్నారు
.
‘హోటల్ కు వెళితే రూంలోకి రావాలన్నారు. మనసు కీడు శంకించింది. మీరే లాబీలోకి రావొచ్చు కదా అని అడిగాను. అతడు ససేమిరా అంటూ గదిలోకి రావాలని చెప్పారు. దీంతో మెట్లెక్కి అతని రూంకి వెళ్లాను. అక్కడ సోఫాలోకూర్చోగానే తన గురించి.. తన గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. ఎంతోమంది నటీమణుల్ని తాను ఇండస్ట్రీకి పరిచయం చేశానని గొప్పలు చెప్పాడు. నాకో మంచి పాత్ర ఇస్తున్నట్లు చెప్పాడు. కానీ.. అదో చిన్న పాత్ర. దాంతో ఆ పాత్ర మీద ఆసక్తి పోయింది. దీంతో వెళతానని చెప్పా.

అదేమిటి..ఈ రోజు రాత్రికి నాతో ఉండవా? అని అడిగాడు. దాంతో బకెట్ ఐస్ వాటర్ నా నెత్తిన పోసినట్లైంది. షాక్ తిన్నాను. నోట మాట రాలేదు. అలాంటి పరిస్థితి అంతకు ముందు ఎదురు కాలేదు. అంతలోనే అతడు కల్పించుకొని బలవంతం ఏమీ లేదన్నాడు. ఆ వెంటనే పరుగుపరుగునా గదిలో నుంచి బయటకు వచ్చేశా’’ అంటూ తనకు ఎదురైన షాకింగ్ ఉదంతాన్ని వెల్లడించాడు. ఇంత జరిగిన తర్వాత ఆ సౌత్ నిర్మాత పేరు చెప్పేస్తే సరిపోయేది కదా? ఆ తరహా వారికి.. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా ఇబ్బందులు తప్పవన్న సందేశాన్ని ఇచ్చినట్లు అయ్యేది కదా నీనా గుప్తాజీ. ఇంతకీ ఆ సౌత్ నిర్మాత ఎవరంటారు?