ఆహా లో నయనతార 'నీడ'.. ఆసక్తికరంగా ట్రైలర్..!

Tue Jul 20 2021 19:05:23 GMT+0530 (IST)

Nayanthara Comes Up With A Cold And Thrilling Needa

100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చిన 'ఆహా'.. ప్రతి వారం సరికొత్త కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ వీక్షకులను అలరిస్తోంది. సూపర్ హిట్ సినిమాలు - వెబ్ సిరీస్ లతో పాటుగా ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ''నీడ'' అనే మరో చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన 'నిళల్' అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార - కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 23న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా 'నీడ' ట్రైలర్ ను ఆహా సోషల్ మీడియా మధ్యమాలలో రిలీజ్ చేసింది.'పిల్లలు చెప్పే కథల్లో నిజం ఎంత? ఒకవేళ అవి నిజమైతే.. తెలిసే నిజాలు.. జరిగే పరిణామాలు ఏంటి?' అని ట్వీట్ లో ఆహా టీమ్ పేర్కొంది. 'నీడ' ట్రైలర్ లోకి వెళ్తే.. 'ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి పట్టుకోండి' అనే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. స్కూల్ లో ఓ పిల్లాడు చెప్పిన థ్రిల్లింగ్ మర్డర్ కథ విని మిగతా పిల్లలు అందరూ వణికిపోయారని ఓ యువతి చెబుతూ ఉండగా.. కుంచాకో బోబన్ ఆ కథ ఏంటని అడుగుతాడు. ఆ తర్వాత స్టోరీ అంతా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా సాగింది. ఇందులో నయన్ ఆ పిల్లాడి తల్లిగా కనిపిస్తుండగా.. ఆ పిల్లాడు చెప్పిన కథ వెనకున్న మిస్టరీని కనుక్కునే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ గా కుంచాకో కనిపిస్తున్నాడు. అతను ఫేస్ కి మాస్క్ పెట్టుకొని డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న 'నీడ' ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

'నీడ' చిత్రానికి అప్పు ఎన్. భట్టాత్రి దర్శకత్వం వహించారు. ఎస్ సంజయ్ స్టోరీ అందించారు. సూరజ్ ఎస్. కురూప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. దీపక్ డి.మీనన్ సినిమాటోగ్రఫీ అందించగా.. అప్పు ఎన్. భట్టాత్రి - అరుణ్ లాల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆంటో జోషప్ - అభిజిత్ పిళ్ళై - బాదుషా - ఫెల్లిని టి.పి - గిణేశ్ జోష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 'నిఫా వైరస్' 'మిడ్ నైట్ మర్డర్స్' వంటి చిత్రాలతో తెలుగు తెరకు పరిచయమైన కుంచాకో బోబన్ - దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కలిసి నటించిన ''నీడ''.. తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.